చిన్నారి పెళ్లికూతురు దర్శకుడు… కూరగాయలమ్ముతున్నాడు !

దేశవ్యాప్తంగా మంచి సీరియల్ గా పేరు తెచ్చుకున్న ‘చిన్నారి పెళ్లికూతురు (బాలికా వధు)’కి దర్శకత్వం వహించిన రామ్ వృక్షా గౌర్ ప్రస్తుతం బండిమీద కూరగాయలు అమ్ముతున్నాడు. కారణమేమిటో వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా… అవును కరోనాయే కారణం.

కోవిడ్ లాక్ డౌన్ వల్ల చేయాల్సిన సినిమాలు ఆగిపోవటంతో సొంత ఊళ్లో తెలిసిన పని చేస్తున్నాడతను. ఉత్తర ప్రదేశ్ లోని అజంఘర్ జిల్లాలో రామ్ కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. ఒక సినిమా ప్రయత్నాల్లో భాగంగా అక్కడకు వెళ్లగా… అప్పుడే లాక్ డౌన్ విధించడంతో ఇక తిరిగి ముంబయికి వెళ్లలేకపోయానని రామ్ తెలిపాడు. సినిమా ప్రారంభం కావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని నిర్మాత చెప్పటంతో తన తండ్రి చేస్తున్న వ్యాపారాన్ని తానూ చేయటం మొదలు పెట్టానన్నాడు రామ్.   కూరగాయల వ్యాపారం తనకు బాగా తెలుసునని ఇది తనకేమీ చిన్నతనంగా అనిపించడం లేదని అతను చెప్పాడు.

2002లో ఒక స్నేహితుడి సహకారంతో ముంబయికి వెళ్లిన తాను… అనేక టీవీ సీరియళ్లకు ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసి… తరువాత అసిస్టెంటు డైరక్టర్ గా మారి… ఆపై బాలికా వధు సీరియల్ కి ఎపిసోడ్ డైరక్టర్ గానూ, యూనిట్ డైరక్టర్ గానూ పనిచేసినట్టుగా రామ్ తెలిపాడు. అతను పలు హిందీ సినిమాలకు అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేశాడు.

ఒక భోజ్ పురి సినిమాకు,  ఓ హిందీ సినిమాకు దర్శకత్వం వహించేందుకు అవకాశం రాగా ఆ సన్నాహాల్లో ఉండగా కరోనా దేశంలోకి అడుగుపెట్టింది. దాంతో రామ్ ప్రయత్నాలు ఆగిపోయాయి. ముంబయిలో తనకు సొంత ఇల్లు ఉందని… ఈ విపత్కర పరిస్థితులు ఒక కొలిక్కి వచ్చాక కచ్చితంగా ముంబయి వెళతానని…అప్పటివరకు ఇక్కడ తనకు చేతనైన పని చేస్తానని రామ్ తెలిపాడు.