Telugu Global
National

కోయంబేడులో కోవిడ్ నియమ ఉల్లంఘనలు !

ఒక వైపు కోవిడ్ లెక్కలు భయపెడుతుంటే మరోవైపు జాగ్రత్తలు పాటించని నిర్లక్ష్యం మరింతగా ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడు, చెన్నైలోని కోయంబేడు హోల్ సేల్ కూరగాయల మార్కెట్లో పరిస్థితి అలాగే ఉంది. మే నెలలో ఇది కరోనాకు హాట్ స్పాట్ గా ఉంది. లాక్ డౌన్లో భాగంగా దానిని మూసివేశారు. ఆహార ధాన్యాల విభాగాన్ని ఈ నెల 18న తెరవగా కూరగాయల విభాగాన్ని మంగళవారం తెరిచారు. పళ్లు, పూల విభాగాలను త్వరలో తెరవనున్నారు.  అయితే కూరగాయల మార్కెట్లో చాలామంది […]

కోయంబేడులో కోవిడ్ నియమ ఉల్లంఘనలు !
X

ఒక వైపు కోవిడ్ లెక్కలు భయపెడుతుంటే మరోవైపు జాగ్రత్తలు పాటించని నిర్లక్ష్యం మరింతగా ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడు, చెన్నైలోని కోయంబేడు హోల్ సేల్ కూరగాయల మార్కెట్లో పరిస్థితి అలాగే ఉంది. మే నెలలో ఇది కరోనాకు హాట్ స్పాట్ గా ఉంది. లాక్ డౌన్లో భాగంగా దానిని మూసివేశారు. ఆహార ధాన్యాల విభాగాన్ని ఈ నెల 18న తెరవగా కూరగాయల విభాగాన్ని మంగళవారం తెరిచారు. పళ్లు, పూల విభాగాలను త్వరలో తెరవనున్నారు. అయితే కూరగాయల మార్కెట్లో చాలామంది మాస్కులు లేకుండానే తమ పని చేసుకుంటూ కనిపిస్తున్నారు. తమిళనాడులో కోవిడ్ కేసులు 5.8 లక్షలు ఉన్నా… ఇంకా జనం నిర్లక్ష్యంగానే ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం.

కోయంబేడు కూరగాయల మార్కెట్లో వ్యాపారులు, పనివాళ్లలో చాలామంది మాస్కులు ధరించటం లేదు. సామాజిక దూరం సైతం పాటించడం లేదు. ట్రక్కులకు సరుకు ఎక్కిస్తున్న చాలామంది కూలీలు మాస్కులు లేకుండానే పనిచేస్తున్నారు. ‘మాకు కోవిడ్ అంటే భయం లేదు. భయపడుతూ కూర్చుంటే డబ్బు ఎలా వస్తుంది. నాలుగునెలల పాటు ఆదాయం లేక చాలా కష్టాలు పడ్డాం ’ కరుణాకరన్ అనే వర్కర్ మాటలివి. ఇతను ఓ హోల్ సేల్ అరటిపళ్ల వ్యాపారి వద్ద పనిచేస్తున్నాడు. ప్రస్తుతం రెండువేల షాపుల్లో ఐదువందలు తెరుచుకోగా అక్కడ పనిచేస్తున్న వారిలో దాదాపు 30శాతం మంది కోవిడ్ నియమాలు పాటించడం లేదు.

ఏప్రిల్ నెలలో ఈ మార్కెట్లో 3,500 మంది వరకు కోవిడ్ బారిన పడ్డారు. కోవిడ్ రాకముందు కాలంలో కోయంబేడు మార్కెట్ లో రోజుకి లక్షమంది వరకు జనం వచ్చిపోతుండేవారు. మార్కెట్లో ఎక్కువమంది శారీరక శ్రమతో కూడిన పనులు చేస్తుంటారు. దాంతో వారికి చెమట పడుతుంటుంది. ఆ కారణంగా మాస్కులు తీసి మళ్లీ వేసుకుంటూ ఉంటారు. గాలి కూడా తక్కువగా ఉండటం వలన మాస్కులు ధరించడం మరింత కష్టంగా ఉంటుందని… అక్కడ పనిచేస్తున్నవారు అంటున్నారు.

చెన్నైలో ప్రస్తుతం రోజుకు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కోవిడ్ నియమాలు పాటించనివారిపై అధికారులు జరిమానాలు సైతం విధిస్తున్నారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇప్పటివరకు యాభై అయిదువేల కేసులు నమోదయ్యాయని, కోటిరూపాయల వరకు జరిమానా వసూలు చేశామని ఆరోగ్య శాఖా సెక్రటరీ జె. రాధాకృష్ణన్ అన్నారు. నియమాలు పాటించనివారు తమకు తాము హాని చేసుకోవడమే కాకుండా ఇతరులకు సైతం హాని కలిగిస్తున్నారనే అవగాహనని పెంచడమే తమ ఉద్దేశ్యమని ఆయన తెలిపారు.

వ్యాపార వర్గాలు, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే… తిరిగి మార్కెట్ కోవిడ్ హాట్ స్పాట్ గా మారిపోతుందేమోనని చాలా మంది భయపడుతున్నారు.

First Published:  29 Sep 2020 11:34 PM GMT
Next Story