Telugu Global
CRIME

హథ్రాస్ లో  ‘నిర్భయ’ న్యాయవాదిని అడ్డుకున్నారు !

కనీవినీ ఎరుగని రీతిలో భయంకరమైన హింసని అనుభవించి ప్రాణాలు వదిలింది ఉత్తర ప్రదేశ్, హథ్రాస్ గ్రామానికి చెందిన యువతి. ఆమెపై దారుణమైన హింసకు పాల్పడినవారితో పాటు… వెంటనే స్పందించకుండా నిర్లక్ష్యం చేసి పోలీసులు సైతం ఆమెకు అన్యాయమే చేశారని ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ యువతి తరపున న్యాయపోరాటం చేసేందుకు నిర్భయ కేసులో వాదించిన సీమా కుష్వాహా ముందుకు రాగా ఆమెని అడ్డుకుంటున్నారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. హతురాలి కుటుంబ సభ్యులను కలిసేందుకు […]

హథ్రాస్ లో  ‘నిర్భయ’ న్యాయవాదిని అడ్డుకున్నారు !
X

కనీవినీ ఎరుగని రీతిలో భయంకరమైన హింసని అనుభవించి ప్రాణాలు వదిలింది ఉత్తర ప్రదేశ్, హథ్రాస్ గ్రామానికి చెందిన యువతి. ఆమెపై దారుణమైన హింసకు పాల్పడినవారితో పాటు… వెంటనే స్పందించకుండా నిర్లక్ష్యం చేసి పోలీసులు సైతం ఆమెకు అన్యాయమే చేశారని ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ యువతి తరపున న్యాయపోరాటం చేసేందుకు నిర్భయ కేసులో వాదించిన సీమా కుష్వాహా ముందుకు రాగా ఆమెని అడ్డుకుంటున్నారు ఉత్తరప్రదేశ్ పోలీసులు.

హతురాలి కుటుంబ సభ్యులను కలిసేందుకు సీమ ప్రయత్నించగా పోలీసులు అనుమతించలేదు. హత్యకు గురయిన యువతి కుటుంబ సభ్యులను కలిసేంతవరకు తాను హథ్రాస్ లోనే ఉంటానని, వారు తనని తమ తరపున న్యాయవాదిగా నిలబడమని కోరారని… కానీ పాలక వర్గాలు తనను… ఆ కుటుంబాన్ని కలవనీయకుండా చేస్తున్నారని… సీమ అన్నారు. తాను హతురాలి సోదరునితో ఫోన్ ద్వారా మాట్లాడుతున్నానని ఆమె తెలిపారు.

నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా గాయపరచగా… ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ హాస్పటల్ లో ఆ యువతి మంగళవారంనాడు మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్రమైన నిరసనలు, ఆందోళనలు చెలరేగాయి. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఈ కేసు విచారణకు నియమించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా దోషులకు త్వరగా శిక్ష పడేలా చూస్తామని పోలీసులు అంటున్నారు.

ఇదిలా ఉండగా… ఢిల్లీలోని డాక్టర్ల బృందం ఇచ్చిన పోస్ట్ మార్టమ్ నివేదిక ప్రకారం… యువతి మెడకు గాయం కావటం వల్లనే మరణించిందని, ఆమెపై అత్యాచారం జరిగినట్టుగా నిర్దారణ కాలేదని… అడిషనల్ డైరక్టర్ జనరల్ ( శాంతి భద్రతలు) ప్రశాంత్ కుమార్ వెల్లడించారు.

ఈ కేసు విషయంలో పోలీసులు చెబుతున్న వివరాలపై ప్రతిపక్షాల నుంచి, సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. హతురాలి కుటుంబానికి న్యాయం జరగకుండా పోలీసులు అడ్డుకుంటున్నారనే వాదనలు వినబడుతున్నాయి.

First Published:  2 Oct 2020 7:28 AM GMT
Next Story