Telugu Global
International

మాస్క్ లేని సమాజం... మంచిదేనా...?

దేశవ్యాప్తంగా కొన్ని రోజులుగా ఒకటే సందడి.. భారత్ లో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల కంటే రికవరీలు పెరుగుతున్నాయి, భారత్ లో కరోనా విలయం తగ్గుతోంది అంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియాతోపాటు, సోషల్ మీడియా కూడా హోరెత్తుతోంది. దీనికి తోడు అన్ లాక్ సడలింపులు అంటూ.. ఒక్కో ముడి విప్పేసుకుంటూ పోతున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఈనెల 15నుంచి సినిమా థియేటర్లు తెరచుకోవడం, ఆ తర్వాత మరో 15రోజులకు స్కూళ్లు మొదలవడంతో.. ఎక్కడికక్కడ పూర్తిగా లాకులెత్తేసినట్టే అనుకోవాలి. […]

మాస్క్ లేని సమాజం... మంచిదేనా...?
X

దేశవ్యాప్తంగా కొన్ని రోజులుగా ఒకటే సందడి.. భారత్ లో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల కంటే రికవరీలు పెరుగుతున్నాయి, భారత్ లో కరోనా విలయం తగ్గుతోంది అంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియాతోపాటు, సోషల్ మీడియా కూడా హోరెత్తుతోంది. దీనికి తోడు అన్ లాక్ సడలింపులు అంటూ.. ఒక్కో ముడి విప్పేసుకుంటూ పోతున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.

ఈనెల 15నుంచి సినిమా థియేటర్లు తెరచుకోవడం, ఆ తర్వాత మరో 15రోజులకు స్కూళ్లు మొదలవడంతో.. ఎక్కడికక్కడ పూర్తిగా లాకులెత్తేసినట్టే అనుకోవాలి. అదే సమయంలో ప్రజల్లో కూడా కరోనాపై భయం క్రమ క్రమంగా తగ్గిపోతోందనే విషయం స్పష్టమవుతోంది. ముఖ్యంగా యువత మాస్క్ ల విషయాన్ని పట్టించుకోవడంలేదు. పల్లెటూళ్లతోపాటు, పట్టణాల్లో కూడా మాస్క్ లేకుండా జనం రోడ్లపైకి వచ్చేస్తున్నారు.

కరోనా వచ్చిన కొత్తల్లో మాస్క్ లేకుండా వస్తే జరిమానా అంటూ పోలీసులు హడావిడి చేయడంతో అందరూ విధిలేక మూతికి గుడ్డ అడ్డంగా కట్టుకున్నారు. ఆ తర్వాత అది అందరికీ అలవాటైపోయింది. బైటకెళ్లేటప్పుడు చెప్పులు వెతుక్కున్నట్టే, మాస్క్ కూడా వెతికి మరీ కట్టుకుని వెళ్లడం మొదలు పెట్టారు. తీరా ఇప్పుడు కరోనా భయం తగ్గిపోయిందన్న వార్తలతో ప్రజల్లో కూడా తేలిక భావం ఏర్పడింది. అందుకే మాస్కులు లేకుండా జనం బైటకు వచ్చేస్తున్నారు.

బస్సు ఎక్కేటప్పుడో, ఏదైనా షాపుకి వెళ్లేటప్పుడో మాస్క్ లేకపోతే లోపలికి రానివ్వరేమోననే అనుమానంతో వాటిని తీసుకుని వెళ్తున్నారు. ఇక ఆఫీసులు, ఇతర పని స్థలాల్లో మాస్క్ లు పక్కనపెట్టి తమ పనుల్లో తాము నిమగ్నమవుతున్నారు చాలామంది.

ఒక్కసారిగా వస్తున్న ఈ మార్పు ఎలాంటి ఉపద్రవానికి దారితీస్తుందో తలచుకుంటేనే భయమేస్తోంది. కేసుల సంఖ్య తగ్గుతున్న మాట వాస్తవమే. ఒకానొక దశలో ఏపీలో రోజుకి పదివేలు దాటిన కరోనా కేసులు ఇప్పుడు ఐదువేల దగ్గరకు చేరుకుంటున్నాయి. మరణాల సంఖ్య కూడా కంట్రోల్ లోకి వచ్చేస్తోంది. ఇదంతా కరోనా ప్రభావం తగ్గడం వల్ల వచ్చిన మార్పు కాదు, ప్రజల్లో అవగాహన పెరగడం వల్ల, ప్రభుత్వం కఠిన నిబంధనలు పాటించడం వల్ల వచ్చింది అనుకోవాలి.

అంతేకానీ, కరోనా వైరస్ బలహీనపడిందని జనం మళ్లీ రోడ్లపైకి వచ్చి రెచ్చిపోతే లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. పరిస్థితి మరోసారి శృతి మించకముందే ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ తప్పనిసరి చేస్తూ హెచ్చరికలు జారీ చేయాలి. వ్యాపార కార్యకలాపాలపై కనీసం కొన్ని ఆంక్షలనయినా కొనసాగించాలి. టీకా వచ్చే వరకు కొన్ని కట్టుబాట్లు ఉంటేనే మంచిది.

First Published:  2 Oct 2020 9:37 PM GMT
Next Story