Telugu Global
International

సుదీర్ఘంగా వెంటాడుతున్న కోవిడ్... కోలుకునేదెలా?

కోవిడ్ 19… చాలామందికి కొద్ది పాటి లక్షణాలతో వచ్చి… పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే తగ్గిపోతోంది. కానీ కొందరి విషయంలో తీవ్రంగా మారి భయపెడుతోంది. దాంతో ఇది మన అంచనాలకు దొరకటం లేదు. కొంతమంది కోవిడ్ బాధితుల్లో  చాలాకాలం పాటు అలసట, శరీరంలో నొప్పులు, శ్వాస సమస్యలు లాంటివి ఉంటున్నాయి. దీర్ఘకాలిక కోవిడ్… ఇప్పుడు చాలామందిని వెంటాడుతోంది. అయితే ఈ లాంగ్ కోవిడ్ కి వైద్యపరమైన నిర్వచనం అంటూ ఏమీలేదు. తప్పనిసరిగా ఇవే లక్షణాలు ఉంటాయని కూడా చెప్పలేము. […]

సుదీర్ఘంగా వెంటాడుతున్న కోవిడ్... కోలుకునేదెలా?
X

కోవిడ్ 19… చాలామందికి కొద్ది పాటి లక్షణాలతో వచ్చి… పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే తగ్గిపోతోంది. కానీ కొందరి విషయంలో తీవ్రంగా మారి భయపెడుతోంది. దాంతో ఇది మన అంచనాలకు దొరకటం లేదు. కొంతమంది కోవిడ్ బాధితుల్లో చాలాకాలం పాటు అలసట, శరీరంలో నొప్పులు, శ్వాస సమస్యలు లాంటివి ఉంటున్నాయి. దీర్ఘకాలిక కోవిడ్… ఇప్పుడు చాలామందిని వెంటాడుతోంది.

అయితే ఈ లాంగ్ కోవిడ్ కి వైద్యపరమైన నిర్వచనం అంటూ ఏమీలేదు. తప్పనిసరిగా ఇవే లక్షణాలు ఉంటాయని కూడా చెప్పలేము. ఎందుకంటే దీని బాధితుల్లో ఏ ఇరువురి లక్షణాలు ఒకేలా కనిపించడం లేదు. వీరిలో ప్రధానంగా కనబడుతున్న సమస్య తీవ్రమైన అలసట. ఇంకా శ్వాసలో సమస్యలు, దగ్గు, కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు, కంటి చూపు వినికిడి సమస్యలు, తలనొప్పులు, రుచి వాసన తెలియకపోవటం, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, పొట్ట భాగాలకు హాని… ఇవే కాకుండా ఆందోళన, డిప్రెషన్, ఆలోచనల్లో స్పష్టత లేకపోవటం లాంటివి కూడా కనబడుతున్నాయి. తీవ్రమైన అలసట కారణంగా కోవిడ్ బాధితులు తమ రోజువారీ పనులను చేసుకునేందుకు సైతం ఇబ్బంది పడుతున్నారు.

ఎక్కువ రోజులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స తీసుకున్నవారిలోనే కాదు… తక్కువ లక్షణాలతో కోవిడ్ ని ఎదుర్కొన్నవారిలో సైతం చాలా ఆరోగ్య సమస్యలు కనబడుతున్నాయి. లాంగ్ కోవిడ్ అనే సమస్య నిజంగానే ఉంది… అందులో ఎలాంటి అనుమానం లేదు అంటున్నారు యుకెలోని ఎక్స్ టర్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ డేవిడ్ స్ట్రైన్. అతను తీవ్రమైన అలసటని తెచ్చిపెడుతున్న లాంగ్ కోవిడ్ కి తన ‘క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ క్లినిక్’ లో చికిత్స చేస్తున్నాడు.

ఎంతమంది దీనికి గురవుతున్నారు?

రోమ్ లోని ఒక పెద్ద హాస్పటల్ లో 143 మంది కోవిడ్ బాధితులపై ఒక అధ్యయనం నిర్వహించారు. హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అయిపోయిన తరువాత వారి ఆరోగ్య పరిస్థితిని గమనించారు. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ లో దీని వివరాలు ప్రచురించారు. ఇందులో 87శాతం మందిలో ఏదో ఒక లక్షణం రెండు నెలల తరువాత కూడా కొనసాగటం గుర్తించారు. ఇక సగం మంది ఇప్పటికీ తీవ్రమైన అలసటకు లోనవుతున్నారు.

యుకెలో కోవిడ్ సింప్టమ్ ట్రాకర్ యాప్ ద్వారా నలభై లక్షలమందిని పరిశీలించారు. 12శాతం మందిలో కోవిడ్ నుండి కోలుకున్న నెల తరువాత కూడా లక్షణాలున్నట్టుగా తేలింది. ఈ అధ్యయనం అందిస్తున్న తాజా వివరాల ప్రకారం… ప్రతి యాభై మందిలో ఒకరిలో తొంభై రోజుల తరువాత కూడా కోవిడ్ లక్షణాలున్నాయి. అంటే వారంతా లాంగ్ కోవిడ్ బాధితులే.

అయితే ఇన్ ఫెక్షన్ వచ్చిన తీవ్రతకు… వారిలో కనబడుతున్న అలసటకు సంబంధం లేదంటున్నారు వైద్యులు. అంటే ఎంత తీవ్రంగా దాని బారిన పడితే అంతగా లాంగ్ కోవిడ్ ని ఎదుర్కోవాల్సి వస్తుందని భావించే అవకాశం లేదు. అయితే న్యూమోనియాకు గురయి ఊపిరితిత్తులు పాడైన వారిలో కోవిడ్ తరువాత మరిన్ని సమస్యలు కనబడుతున్నట్టుగా తెలుస్తోంది.

లాంగ్ కోవిడ్ కి కారణాలు ఏంటి?

సాధారణంగా కోవిడ్ చికిత్స అనంతరం శరీరంలోని వైరస్ చాలావరకు పోతుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం అది అలాగే ఉండిపోతుంది. ఒకవేళ ఎక్కువ కాలం విరేచినాలు సమస్యతో బాధపడి ఉంటే వారి పొట్టలో కొంతవరకు బ్యాక్టీరియా మిగిలిపోయి ఉండే అవకాశం ఉంది. అలాగే వాసన తెలియకపోవటం సమస్యని ఎదుర్కొన్నవారిలో వైరస్… నరాల్లో నిలిచి ఉండవచ్చు. దాంతో తరువాత సమస్యలకు దారితీయవచ్చు.

కరోనా వైరస్ శరీరంలో వివిధ భాగాల్లోని కణాలను నేరుగా ఇన్ ఫెక్షన్ కు గురిచేస్తుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థ తీవ్రంగా స్పందించేలా చేస్తుంది. ఈ కారణంగా కూడా శరీరం మొత్తం వైరస్ కారణంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కోవిడ్ తరువాత రోగనిరోధక వ్యవస్థ యధాస్థితికి రాకపోవటం వలన కూడా అనారోగ్యాలు వస్తున్నాయనే అభిప్రాయం సైతం వైద్యుల్లో ఉంది. వైరస్… బాధితుల అవయవాల పనితీరుని, మెటబాలిజంని కూడా మార్చేస్తుందని భావిస్తున్నారు. మెదడు ఆకారంలో సైతం మార్పులు వస్తున్నాయని గుర్తించారు. అయితే దీనిపై ఇంకా పరిశోధన చేయాల్సి ఉంది. అలాగే రక్తం గడ్డకట్టటం లాంటి సమస్యలతో రక్తంలో సైతం మార్పులు రావటం గమనించారు.

మరి పూర్తిగా రికవర్ అయ్యే అవకాశమే లేదా?

కాలం గడుస్తున్న కొద్దీ లాంగ్ కోవిడ్ కి గురవుతున్నవారి సంఖ్య తగ్గుతున్నదని వైద్యులు భావిస్తున్నారు. కోవిడ్ కొత్త వైరస్ కనుక దీని గురించిన అధ్యయనాలు, గణాంకాలు సరిపడా లేకపోవటం వలన శాస్త్రవేత్తలు ఏదీ కచ్ఛితంగా చెప్పలేకపోతున్నారు. కోవిడ్ బాధితులపై 25 ఏళ్లపాటు పరిశోధనలు నిర్వహించాల్సిన అవసరం ఉందని, సంవత్సరం దాటాక చాలా కొద్ది సంఖ్యలో మాత్రమే లాంగ్ కోవిడ్ బాధితులు ఉంటారని భావిస్తున్నామని, అయితే తన అభిప్రాయం తప్పుకూడా కావచ్చని బ్రైట్లింగ్ అనే ప్రొఫెసర్ అంటున్నారు.

కాబట్టి ఒకసారి కోవిడ్ వచ్చి తగ్గిన తరువాత కూడా జీవితమంతా దాని తాలూకూ బాధలు ఉండే అవకాశం ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. దీర్ఘకాలిక ఫెటీగ్ సిండ్రోమ్ ఉన్నవారికి కోవిడ్ మళ్లీ వచ్చే అవకాశం ఉంది. అలాగే భవిష్యత్తులో ఇతర అంటువ్యాధులు సోకే ప్రమాదం సైతం ఎక్కువగా ఉంటుంది.

ఇవి గుర్తుంచుకోవాలి…

కోవిడ్ నుండి రికవర్ అయ్యే క్రమంలో మూడు విషయాలు గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ ఒత్తిడికి, శ్రమకు గురికాకుండా ప్రశాంతంగా ఉంటూ తగినంత విశ్రాంతి తీసుకోవటం, వరుసగా కష్టతరమైన పనులు చేయకుండా అలాంటి పనుల మధ్య కొన్ని రోజుల విరామం ఉండేలా ప్లాన్ చేసుకోవటం, ఏవి అవసరమైన పనులు… ఏవి పక్కన పెట్టవచ్చు అనేది పరిశీలించుకుని అవసరమైన వాటికి మాత్రమే ప్రాధాన్యతని ఇవ్వటం…వీటన్నింటితో పాటు… అసలు కోవిడ్ రాకుండానే నివారణ చర్యలు తీసుకోవటం, జాగ్రత్తగా ఉండటం అనేవి నిరంతరం గుర్తుంచుకోవాల్సిన విషయాలు.

First Published:  7 Oct 2020 8:27 AM GMT
Next Story