నాడు నేడూ చంద్రబాబుకే మంచి…

రాష్ట్ర భద్రతా కమిషన్‌లో ప్రతిపక్ష నేతకు స్థానం కల్పించాల్సిందేనని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా భద్రతా కమిషన్‌లో ప్రతిపక్ష నేత పేరు చేరుస్తూ సవరణ ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేసింది. ప్రతి రాష్ట్రంలోనూ భద్రతా కమిషన్ ఏర్పాటు చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా 2013లో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం భద్రతా కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

హోంమంత్రి చైర్మన్‌గా, ప్రతిపక్ష నేత, డీజీపీ, సీఎస్‌ తో పాటు మరో ఐదుగురు నామినేటెడ్ సభ్యులతో కమిషన్ ఏర్పాటు చేశారు. నాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ కమిషన్‌లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు అవకాశం కల్పించింది.

చంద్రబాబు సీఎం అయిన తర్వాత నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌మోహన్ రెడ్డికి ఈ కమిషన్‌లో చోటు ఉండకూడదు అన్న ఉద్దేశంతో… రాష్ట్ర భద్రతా కమిషన్‌లో ప్రతిపక్ష నేతకు చోటు లేకుండా 2018 ఏప్రిల్‌లో కొత్తగా జీవో 42ను ఇచ్చారు.

ఇప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత భద్రతా కమిషన్‌లో ప్రతిపక్ష నేతకు అవకాశం ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విచారించిన కోర్టు… భద్రతా కమిషన్‌లో ప్రతిపక్ష నేతకు చోటు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతకు అవకాశం లేకుండా చేశారు… ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేత హోదాలో మాత్రం భద్రతా కమిషన్‌లో సభ్యుడు కాబోతున్నారు. అప్పుడు ఇప్పుడు ఆయనకే మంచి జరిగిందని అంటున్నారు.