చినబాబుకి బాధ్యతలు… ఇదే తొలి సంకేతం…

2019 ఎన్నికల్లో గెలిచి ఉంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరోలా ఉండేది. పార్టీపై, ప్రభుత్వంపై పెత్తనం లోకేష్ చేతుల్లోకి ఆటో మేటిక్ గా వెళ్లిపోయేవి. కానీ టీడీపీ ఘోర పరాభవంతోపాటు… మంగళగిరిలో లోకోష్ ఓడిపోవడంతో… ఆ వ్యవహారం కాస్త ఆలస్యమైంది.

మరోవైపు చంద్రబాబు కూడా కొడుక్కి బాధ్యతలు అప్పగించడాని ఉత్సాహం చూపిస్తున్నట్టు ఉన్నారు. అందుకే తాను వెనకుండి కొడుకుని పరామర్శలకు పంపిస్తున్నారు. అనంతపురంలో జేసీ సోదరుల ఓదార్పు యాత్రకు లోకేష్ ముందడుగు వేశారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడి కుటుంబాన్ని కూడా లోకేషే వెళ్లి పరామర్శించి వచ్చారు.

ఇటీవల అమరావతి ఉద్యమం 300రోజులకి చేరుకున్న నేపథ్యంలో చంద్రబాబు రాకుండా లోకేష్ ని బైటకు పంపించారు. బాబు కేవలం ట్విట్టర్ కి పరిమితమై కొడుకుని జనాల్లోకి పంపిస్తున్నారు.

ఇక ఇప్పుడు కీలకమైన మరో ఘట్టంలో కూడా లోకేష్ మాత్రమే కన్పించారు. టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇటీవలే అధ్యక్షుల్ని నియమించారు. వారితోపాటు మహిళా విభాగానికి కూడా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అధ్యక్షులను, ప్రధాన కార్యదర్శులను నియమించారు. వీరి ప్రమాణ స్వీకారోత్సవం లోకేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు కూడా హాజరు కాలేదు. చంద్రబాబు అసలే రాలేదు. కేవలం లోకేష్ ని హైలెట్ చేయడం కోసమే మహిళా నాయకుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని జరిపించారు.

ఇకపై భవిష్యత్ లో అంతా లోకేష్ తోనే కలసి నడవాలని, మీ భావి నాయకుడు ఈయనే అనే సంకేతాన్నిచ్చారు. త్వరలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసిన అధ్యక్షులకు కూడా ఇలాంటి కార్యక్రమమే పెట్టాలనుకుంటున్నారట. దీనిని కూడా లోకేష్ సారథ్యంలోనే నిర్వహిస్తారని తెలుస్తోంది.

మొత్తానికి తన పరోక్షంలో లోకేషన్ ని భావినాయకుడిగా పరిచయం చేస్తూ కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నారు చంద్రబాబు.