హీరోయిన్లపై పెరుగుతున్న సింపతీ

సుశాంత్ సింగ్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ కేసులో రియాను అరెస్ట్ చేసి అటుఇటుగా నెల రోజుల పాటు జైలులో ఉంచారు. ఆ తర్వాత ఆమెపై తగినన్ని సాక్ష్యాధారాలు సంపాదించలేకపోయారు పోలీసులు. దీంతో రియాకు బెయిల్ ఇచ్చింది ముంబయి హైకోర్టు. సరిగ్గా ఇలాంటి సీన్ బెంగళూరులో కూడా రిపీట్ అవుతోంది.

డ్రగ్స్ ఆరోపణలపై హీరోయిన్లు సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదిలను అరెస్ట్ చేశారు సీసీబీ పోలీసులు. అయితే వీళ్లకు మాత్రం ఇంకా బెయిల్ రాలేదు. దీంతో కన్నడచిత్రసీమలో ఈ ఇద్దరు హీరోయిన్లపై సింపతీ పెరుగుతోంది. కేవలం ఇద్దరు హీరోయిన్లను అరెస్ట్ చేసి, డ్రగ్స్ కేసును సాగదీయాలని చూస్తున్నారంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడ్ని లేదా హీరోను అరెస్ట్ చేయలేకపోయారని.. హీరోయిన్లను మాత్రం నిర్బంధంలోకి తీసుకోవడం దారుణమని అంటున్నారు. మరోవైపు ఆధారాలు బలంగా లేకపోయినా ఇంకా వాళ్లను జైలులో ఉంచడం అన్యాయం అంటున్నారు. ఇలా రాగిణి, సంజనాకు ఊహించని విధంగా మద్దతు పెరగడంతో.. వాళ్లకు బెయిల్ దొరికే అవకాశాలు పెరిగాయి.