కనకదుర్గ ఫ్లైవోవర్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, సీఎం వైఎస్ జగన్

విజయవాడ నగర వాసులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న కనకదుర్గ ఫ్లైవోవర్‌ను శుక్రవారం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్ విధానంలో ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు. దుర్గగుడి ఫ్లైవోవర్ ప్రారంభంతో పాటు రాష్ట్రంలోని 9 జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. అలాగే ఏపీలో కొత్తగా నిర్మించనున్న 16 బ్రిడ్జిలకు ఆయన శంకుస్థాపన చేశారు.

2.6 కిలోమీటర్ల పొడవుతో, 6 వరుసలతో కనకదుర్గ ఫ్లైవోవర్ నిర్మాణాన్ని 2015లో ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం రూ. 355 కోట్లు, ఏపీ ప్రభుత్వం రూ. 146 కోట్లు ఖర్చు చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఫ్లైవోవర్ పనులు నత్తనడకన సాగడంతో విజయవాడ ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది.

కాగా, జగన్ సీఎం అయిన తర్వాత పనుల్లో వేగం పెంచారు. దాదాపు మూడేళ్ల పాటు సాగిన దీని నిర్మాణం ఇటీవలే పూర్తయ్యింది. ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. కాగా దేశంలో ఆరు వరుసలతో నిర్మించిన మూడో ఫ్లైవోవర్ ఇదే. గతంలో ముంబయి, ఢిల్లీలో మాత్రమే ఇలాంటి వంతెనలను నిర్మించారు.