సోషల్‌ మీడియా వార్తలపై ఆంక్షలు విధించలేం

మధ్యప్రదేశ్‌ హైకోర్టు తాజాగా సోషల్ మీడియాకు సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేసింది. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా పలు అంశాలు ప్రచారం అవుతున్నాయి… వాటిలో అవాస్తవాలు కూడా ఉంటున్నాయి కాబట్టి వాటిని అడ్డుకోవాలంటూ ఒక వ్యక్తి మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

సమాచార శాఖ నుంచి అనుమతులు కూడా తీసుకోకుండా కొందరు ఫేక్ జర్నలిస్టులు సోషల్‌ మీడియాలో వార్తలు ప్రచురిస్తున్నారని… కాబట్టి వాటిని అడ్డుకోవాలంటూ పిల్‌లో కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ ఎస్‌సీ శర్మ, జస్టిస్ శైలేంద్ర శుక్లా ధర్మాసనం… పిటిషనర్‌ విజ్ఞప్తిని తిరస్కరించింది.

వైడ్ ఎలిగేషన్స్ చేసి మొత్తం సోషల్ మీడియాలో వార్తలను అడ్డుకోవాలనడం సరికాదని వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను అడ్డుకునేందుకు బ్లాంకెట్ ఆర్డర్స్‌ తాము ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఏదైనా ప్రత్యేకంగా ఒక నేరం జరిగితే దానిపై ఫిర్యాదు చేసేందుకు తగిన వ్యవస్థ అందుబాటులో ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.

చివరకు సోషల్ మీడియాలో వార్తలను నియంత్రించాలన్న పిటిషన్‌ను తిరస్కరిస్తూ… సోషల్ మీడియాలో వార్తల చలామణిపై తాము నిషేధ ఆర్డర్స్ ఇవ్వలేమని మధ్యప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది.