Telugu Global
National

దుర్గమాత విగ్రహం బదులు 'వలస కార్మిక మాత' విగ్రహం

ఈ ఏడాది కోవిడ్-19 ప్రపంచ దేశాలతో పాటు మన దేశాన్ని కూడా అతలాకుతలం చేసింది. కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఒక్క రోజు గ్యాప్‌తో లాక్‌డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా ఎంతో మంది ఇబ్బందులకు గురయ్యారు. లాక్‌డౌన్ సమయంలో అత్యంత ఇబ్బందులు పడింది వలస కార్మికులు, కూలీలే. దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది వలస కార్మికులు నగరాలు, పట్టణాల నుంచి వందలు, వేల కిలోమీటర్ల దూరంలో […]

దుర్గమాత విగ్రహం బదులు వలస కార్మిక మాత విగ్రహం
X

ఈ ఏడాది కోవిడ్-19 ప్రపంచ దేశాలతో పాటు మన దేశాన్ని కూడా అతలాకుతలం చేసింది. కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఒక్క రోజు గ్యాప్‌తో లాక్‌డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా ఎంతో మంది ఇబ్బందులకు గురయ్యారు.

లాక్‌డౌన్ సమయంలో అత్యంత ఇబ్బందులు పడింది వలస కార్మికులు, కూలీలే. దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది వలస కార్మికులు నగరాలు, పట్టణాల నుంచి వందలు, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామాలకు వెళ్లడానికి నానాయాతనలు పడ్డారు. రోడ్ల వెంబడి, పట్టాల వెంట నడుచుకుంటూ నానా కష్టాలు పడుతూ వెళ్లడం మనం మీడియాలో చూశాం. ఇలా నడుచుకుంటూ వెళ్తూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లు కూడా ఉన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంపై చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదు.

ముఖ్యంగా మహిళా వలస కూలీలు తమ పిల్లలను చంకనెత్తుకొని, కిలోల కొద్ది బరువును నెత్తిపై పెట్టుకొని నడవడం టీవీలు, పేపర్లలో చూసి గుండె చలించని మనిషి లేడు. అలా కొన్ని వందల కిలోమీటర్లు నడిచి స్వగ్రామాలకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని బెహలా ప్రాంతంలోని బరిషా క్లబ్ వినూత్న నిర్ణయం తీసుకుంది.

బెంగాల్‌లో దసరా సమయంలో ప్రతీ ఏడాది దుర్గమాత పూజను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అయితే ఈ సారి బరిషా క్లబ్ దుర్గమాత విగ్రహం బదులు ‘వలస కార్మిక మాత’ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముతక చీర కట్టుకున్న ఒక మహిళ.. బట్టలు వేసుకోని చంటి పిల్లాడిని ఎత్తుకొని ఉన్న రూపంలో ఈ విగ్రహాన్ని రూపొందించారు.

అలాగే ఈ తల్లి వెనుక ఇద్దరు కూతుర్ల విగ్రహాలు కూడా పెట్టనున్నారు. ఒక అమ్మాయి చేతిలో గుడ్లగూబను మరో కూతురు బాతును నిమురుతూ ఉన్నట్లుగా రూపొందించారు. వీళ్లతో పాటు నాలుగో బిడ్డగా చిన్న వినాయకుడి విగ్రహాన్ని కూడా పెట్టనున్నారు.

సాధారణంగా పది చేతులు కలిగిన దుర్గ మాత విగ్రహాన్ని ప్రతిష్టిస్తుంటారు. కానీ ఈ సారి ఈ సాధారణ తల్లి విగ్రహం.. నలుగురు పిల్లల విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారు. తన పిల్లలకు ఏదైనా సాయం చేయమంటూ దీనమైన ముఖంతో కాస్త వెనక్కు తిరిగి చూస్తున్నట్లు అత్యంత హృద్యంగా ఈ విగ్రహాన్ని రూపొందించారు.

32 ఏళ్ల చరిత్ర కలిగిన బరిషా క్లబ్ ఈ సారి సరికొత్తగా దుర్గ పూజను నిర్వహించనుంది. ఇందుకు కోసం ‘సహాయం, పునరావాసం’ అనే థీమ్‌ను చెప్పగా.. రింటూ దాస్ అనే శిల్పకారుడు ఈ విగ్రహాన్ని రూపొందించాడు.

First Published:  16 Oct 2020 12:36 AM GMT
Next Story