బన్నీ, మహేష్, నితిన్ సినిమాలు మళ్లీ రిలీజ్

దేశవ్యాప్తంగా నిన్నట్నుంచి థియేటర్లు తెరుచుకున్నాయి. అన్ లాక్ 5.0 లో భాగంగా కేంద్రం థియేటర్లు ఓపెన్ చేసేందుకు అనుమతులు ఇవ్వడంతో 14 రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకున్నాయి. అయితే వివిధ కారణాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమా హాళ్లు తెరవలేదు. అటు పొరుగునే ఉన్న కర్ణాటకలో మాత్రం మల్టీప్లెక్సులు ఓపెన్ అయ్యాయి.

అయితే థియేటర్లు తెరుచుకున్నప్పటికీ వెంటనే ప్రదర్శించడానికి కొత్త సినిమాల్లేవు. అందుకే పాత సినిమాల్నే మరోసారి ప్రదర్శించడానికి రెడీ అయ్యాయి యాజమాన్యాలు. ఇందులో భాగంగా మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు, బన్నీ చేసి అల వైకుంఠపురములో, నితిన్ నటించిన భీష్మ సినిమాల్ని బెంగళూరు మల్టీప్లెక్సులు మళ్లీ తెరపైకి తెచ్చాయి.

ఈ మేరకు ఆన్ లైన్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఆదివారం నుంచి ఈ సినిమాలు బెంగళూరులో ప్రదర్శనకు రాబోతున్నాయి.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిపితే గిట్టుబాటు కాదని ఏపీ థియేటర్ యాజమాన్యాలు నిర్ణయించాయి. పైగా విద్యుత్ బిల్లుల మాఫీపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో థియేటర్లు మూసే ఉంచాలని నిర్ణయించాయి.

అటు తెలంగాణలో యాజమాన్యాలు సినిమా హాళ్లు తెరిచేందుకు మొగ్గుచూపించినప్పటికీ, ప్రభుత్వం నుంచి ఇంకా పూర్తిస్థాయిలో అనుమతులు రాలేదు. దీనికితోడు భారీ వర్షాలు ఇబ్బందికరంగా మారాయి.