వైసీపీ ఎంపీపై రాడ్‌తో దాడికి యత్నం

వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌పై టీడీపీ కార్యకర్త దాడికి ప్రయత్నించాడు. ఇసుప రాడ్డుతో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఎంపీ ఇంటి వద్దే ఈ దాడికి ప్రయత్నం జరిగింది.

ఉద్దండరాయునిపాలెంలోని తన నివాసం నుంచి బయటకు వెళ్లేందుకు నందిగం సురేష్‌ కారులో బయలుదేరిన సమయంలో టీడీపీ కార్యకర్త బత్తుల పూర్ణచంద్రరావు ఒక్కసారిగా తన బైక్‌పై దూసుకొచ్చి కారుకు అడ్డంగా నిలిపాడు.

వెంటనే ఇసుప రాడ్డు తీసుకుని వచ్చి ఎంపీపై దాడి చేయబోయాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే దాడిని నిలువరించారు.

భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో వారి నుంచి తప్పించుకునేందుకు సమీపంలోని అమరావతి జేఏసీ నాయకుడు పులి చిన్న ఇంట్లోకి వెళ్లి దాక్కునేందుకు పూర్ణచంద్రరావు ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది వెంబడించి పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. రాత్రి 10.30 సమయంలో ఈ ఘటన జరిగింది.

గత కొంతకాలంగా అమరావతి ఉద్యమకారులు పదేపదే దళిత ప్రజాప్రతినిధులైన నందిగం సురేష్‌, ఉండవల్లి శ్రీదేవిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు.