ఒకే ఒక్కడు… సినిమా పేరు కాదు… ప్రేక్షకుడు !

లాక్ డౌన్ నిబంధనల సడలింపుల్లో భాగంగా చాలా రాష్ట్రాల్లో సినిమా హాళ్లు తెరుచుకుంటున్నాయి. అయితే కోవిడ్… ‘ఎవరొస్తారో చూస్తా…’ అని సవాల్ విసురుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఏడునెలల అనంతరం తెరుచుకున్న సినిమా హాళ్లకు కలెక్షన్లు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరమే. చండీఘర్ లోని సిటీ సెంటర్ మాల్…ఐటి పార్క్ లోని పివిఆర్ థియేటర్లో హాల్స్ తెరిచిన మొదటి రోజున మధ్యాహ్నం పన్నెండున్నర గంటల షోకి…  ఒకే ఒక్క ప్రేక్షకుడు మాత్రమే వచ్చాడు. చాలా థియేటర్లలో పరిస్థితి ఇలాగే ఉన్నా ఈ పివిఆర్ థియేటర్ లో 210 సీట్ల కెపాసిటీ ఉన్న హాల్లో సందీప్ షౌరీ అనే ఒకే ఒక్క ప్రేక్షకుడు సినిమా చూశాడు.

సెప్టెంబరు 24న కోవిడ్ పాజిటివ్ కి గురై… కోలుకున్న సందీప్ తాను సినిమాకు వీరాభిమానిని అంటున్నాడు. యాభై ఏళ్ల ఈ ప్రభుత్వ ఉద్యోగి… సినిమా చూడకుండా ఉండలేనని అందుకే హాల్స్ తెరవగానే వచ్చేశానని తెలిపాడు. ఇతను ‘క్యారీ ఆన్ జట్టా 2’ అనే పంజాబీ సినిమాని హాలంతా ఒక్కడై చూశాడు. తనకుటుంబమంతా సినిమా అభిమానులమేనని, ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తాను ముందుగా చూసి వస్తానని చెప్పి ఒంటరిగా వచ్చానని సందీప్ అన్నాడు. పెద్ద తెరపై సినిమా చూస్తే వచ్చే ఆనందమే వేరని, ఇంట్లో టీవీలో చూసినా, ఆన్ లైన్ లో కొత్త సినిమాలు చూసినా ఆ ఎంజాయ్ మెంట్ ఉండదని అతను తెలిపాడు. మాస్క్, శానిటైజర్ తో అన్ని జాగ్రత్తలు తీసుకుని సినిమాకు వచ్చినట్టుగా చెప్పాడు. సినిమా హాల్స్ కి ప్రేక్షకులు రాకపోవడానికి కారణం… కొత్త సినిమాలు లేకపోవడమేనని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కొత్తసినిమాలు రిలీజ్ అయితే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందని వారు భావిస్తున్నారు.

సినిమా హాల్స్ యాజమాన్యాలు కరోనా నియంత్రణకు పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఉదాహరణకు చండీఘర్ లోని సిటీసెంటర్ మాల్ లో తీసుకున్న జాగ్రత్తలను గురించి చెప్పాలంటే…  లోపలికి ప్రవేశించినవారిని ఆరోగ్య సేతు యాప్ ని డౌన్ లోడ్ చేసుకోమని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. టెంపరేచర్ చెక్ చేసి, చేతులు శానిటైజ్ చేసుకునేలా చూస్తున్నారు. పివిఆర్ థియేటర్ బయట కౌంటర్లో పిపిఇ కిట్ పేరుతో శానిటైజర్, మాస్క్, గ్లౌజులను అమ్ముతున్నారు. ఈ కిట్ ధర యాభై నుండి 30 రూపాయల వరకు ఉంది.  టికెట్లు ఇచ్చేవారు సైతం పూర్తి మాస్క్ తో ఫేస్ షీల్డుతో ఉంటున్నారు. హాల్లోకి వెళ్లేముందు టికెట్ చూపించడానికి కూడా శానిటైజ్ చేసుకోమని సిబ్బంది చెబుతున్నారు. అలాగే కోవిడ్ నియంత్రణ జాగ్రత్తలు థియేటర్ బయట డిస్ ప్లే స్క్రీన్ల మీద ప్రసారం చేస్తున్నారు.

210 సీట్లున్న థియేటర్లో 105 టికెట్లు మాత్రమే అమ్ముతున్నారు. అంతేకాదు నోట్లతో నేరుగా డబ్బు చెల్లించకుండా టికెట్ బుకింగ్, ఫుడ్ కౌంటర్ల వద్ద క్యూ ఆర్ కోడ్ స్కానర్ ని ఏర్పాటు చేసి ఆన్ లైన్ లో ‘పే’ చేసే అవకాశం కల్పిస్తున్నారు. చాలా హాల్స్ ని ఎలక్ట్రోస్టాటిక్ స్ప్రే గన్స్ ద్వారా శానిటైజ్ చేస్తున్నారు. అయితే ఇన్ని చేసినా… ప్రేక్షకులు వస్తారా రారా అనే సందేహం, భయం సినిమా థియేటర్ల సిబ్బందిలో ఉంది.