నాగచైతన్య సినిమా మరింత లేటు

కరోనాతో సంబంధం లేకుండానే నాగచైతన్య సినిమా చాలా లేట్ అయింది. ఆ లేటుకు తోడు లాక్ డౌన్ పడ్డంతో సినిమా ఏడాదిగా సాగుతూ వస్తోంది. ఇప్పుడీ మూవీ మరోసారి ఆలస్యమైంది.

అవును.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య-సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల మరింత ఆలస్యమౌతోంది. లెక్కప్రకారం ఈ మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అప్పటికి కరోనా పరిస్థితులు ఇంకా తగ్గుముఖం పట్టవని, ప్రేక్షకులు థియేటర్లకు రారని అంచనా వేస్తున్నారు మేకర్స్.

జనవరిలో వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే పవన్ కల్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ ను సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. సో.. పవన్ పై పోటీకి వెళ్లడం కమ్ములకు ఇష్టంలేదు. దీంతో లవ్ స్టోరీ సినిమాను ఏకంగా వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేసినట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే తమ సినిమా రిలీజ్ డేట్ ను బయటపెట్టడానికి మేకర్స్ ఒప్పుకోవడం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత విడుదల తేదీ చెబుతామంటున్నారు.