జగన్ లేఖలో ప్రతి అక్షరం సరైనదే – మాడభూషి శ్రీధర్…

సీఎం జగన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖపై రాష్ట్ర, దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తున్న నేపథ్యంలో కొంతమంది న్యాయ నిపుణులు ఆయనకి పూర్తి మద్దతునివ్వగా, మరికొందరు జగన్ కి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు.

ప్రఖ్యాత న్యాయనిపుణుడు, సమాచార చట్టం మాజీ కమిషనర్, బెన్నెట్ లా యూనివర్శిటీ డీన్ మాడభూషి శ్రీధర్ కూడా జగన్ కి తన మద్దతు తెలిపారు. మాడభూషి శ్రీధర్.. రామోజీ రావుకి కూడా చాలా దగ్గరి వ్యక్తి కావడం విశేషం. ఈనాడు వ్యాసకర్తగా ఆ సంస్థతో మంచి అనుబంధం కూడా ఉంది. అలాంటి వ్యక్తి కూడా జగన్ రాసిన లేఖలో న్యాయం ఉందని కుండబద్దలు కొట్టారు.

రాష్ట్రానికి అధినేతగా తనకు వచ్చే నివేదికలను, వాటిలో ఏదైనా సమాచారం రాష్ట్రానికి నష్టం కలిగించేట్లు ఉంటే దాన్ని కేంద్రానికి తెలపడం ముఖ్యమంత్రి విధి అని తెలిపారు శ్రీధర్. తప్పులను రహస్యంగా ఉంచాలనుకోవడం తప్పు అని, వాటిని బహిరంగ పరచాలనుకోవడం ఏవిధంగా తప్పు అవుతుందని ప్రశ్నించారు. జగన్ రాసిన లేఖను బహిరంగ పరచడంలో తనకు ఎలాంటి తప్పు కనిపించలేదన్నారు శ్రీధర్.

జగన్ కి ఎవరు సలహా ఇచ్చారో కానీ, ఆయన రాసిన లేఖలో ప్రతి అక్షరం సూపర్బ్ అని మెచ్చుకున్నారు శ్రీధర్. చాలా హుందాగా ప్రధాన న్యాయమూర్తిపై విశ్వాసం ఉంచుతూ, ఏపీ హైకోర్టుని సమున్నత స్థానంలో నిలపడానికి మీకు తోచిన చర్యలు తీసుకోవాలంటూ లేఖలో జగన్ పేర్కొన్నారని, ఆ లేఖ చాలా హుందాగా ఉందని అన్నారు. పైగా జగన్ లేఖలో తనకు నష్టం జరిగినా పర్వాలేదు, రాష్ట్రానికి న్యాయం జరగాలనే ఉద్దేశం స్పష్టమవుతోందన్నారు. తనపై అనేక కేసులు ఉన్నా కూడా, తనపై కక్షకడితే వ్యక్తిగతంగా తనకు నష్టం జరుగుతుందనే భయం లేకుండా జగన్ లేఖ రాయడాన్ని ఆయన ప్రశంసించారు.

జగన్ కేసుల విచారణ జరుగుతోంది హైదరాబాద్ సీబీఐ కోర్టులో అని, ఏపీ హైకోర్టుని ఆయన భయపెట్టడానికి లేఖ రాశారనడంలో అర్థం లేదని వివరించారు. గతంలో చీఫ్ జస్టిస్ కి వ్యతిరేకంగా తీర్మానం చేసిన చరిత్ర ఢిల్లీ బార్ కౌన్సిల్ కి ఉందని, అలాంటి వారు ఇప్పుడు కోర్టుల గౌరవం గురించి మాట్లాడుతూ, జగన్ లేఖని వ్యతిరేకించడం హాస్యాస్పదం అని అన్నారు శ్రీధర్. ఇదే విషయమై జగన్ పై కోర్టులో వేసిన పిల్ పై కూడా తీవ్రంగా స్పందించారాయన.

చట్టం, రాజ్యాంగం గురించి ఓనమాలు తెలియని వ్యక్తులే ఇలాంటి విషయాలపై పిల్ వేస్తుంటారని చెప్పారు. గతంలో న్యాయమూర్తులపై లైంగిక ఆరోపణలు సైతం వచ్చాయని, కొంతమందిపై ఎఫ్ఐఆర్ లు నమోదైన సంఘటనలూ ఉన్నాయని చెప్పారు. 1976లో మద్రాస్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ కె.వీరస్వామిపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద లంచాలు తీసుకుంటున్నారని అప్పటి ముఖ్యమంత్రి ఆరోపణలు చేయగా.. ఆయనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని గుర్తు చేశారు. తమపైనే ఆరోపణలు వచ్చినా తప్పించుకోకుండా విచారణకు సిద్ధమైన జడ్జిలు ఉన్న చరిత్ర భారత న్యాయవ్యవస్థకు ఉందని… ఈ విషయంలో కూడా అలానే జరగాలని ఆయన అన్నారు.

జస్టిస్ ఎన్వీ రమణ.. సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ అవుతారా, లేదా, ఆయన దోషా లేక నిర్దోషా అనే విషయాలను పక్కనపెట్టి ముందు ఆయనపై విచారణ జరిపించాలని, అప్పుడే న్యాయస్థానాల గౌరవం పెరుగుతుందని చెప్పుకొచ్చారు. రహస్యం పేరుతో విచారణ జరపకుండా చూడటం, న్యాయస్థానాల గౌరవాన్ని తగ్గిస్తుందని స్పష్టం చేశారు శ్రీధర్.