మిథున్ చక్రవర్తి కొడుకుపై రేప్ కేసు !

బాలివుడ్ నటుడు మిథున్ చక్రవర్తి కొడుకు… మహాక్షయ్ పై ముంబయి పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. అతనిపై రేప్, మోసం కేసులను, అతని తల్లి, మిథున్ భార్య అయిన యోగితాబాలి పైన మోసం తాలూకూ కేసులను పోలీసులు నమోదు చేశారు. ఒక మహిళ వీరిరువురిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2015లో మహాక్షయ్ తనపై అత్యాచారం చేశాడని, పెళ్లి చేసుకుంటానని ప్రలోభపెట్టి  2018 వరకు ఆ బంధం కొనసాగేలా చేశాడని,  అబార్షన్ చేయించుకునేలా ఒత్తిడి చేశాడని, చివరికి తనని పూర్తిగా మోసం చేశాడని 38 ఏళ్ల ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

2015లో అంథేరి వెస్ట్ లోని ఆదర్శ్ నగర్ లో మహాక్షయ్ కొన్న ఫ్లాట్ ని చూసేందుకు వెళ్లినప్పుడు సాఫ్ట్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చి అతను తనపై అత్యాచారానికి పాల్పడినట్టుగా ఆమె తెలిపింది. ఆ తరువాత కూడా పెళ్లి చేసుకుంటానని తనని నమ్మించాడని, తనకు ప్రెగ్నెన్సీ రాగా అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి తెచ్చాడని ఆమె చెప్పింది.

2018 జనవరిలో అతను తనని పెళ్లి చేసుకునేది లేదని చెప్పేశాక ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిథున్ చక్రవర్తి భార్య యోగితా బాలి… కేసు వాపస్ తీసుకోమని బెదిరించింది. అదే సంవత్సరం మహాక్షయ్ టీవీ నటి మదాలసా శర్మని వివాహం చేసుకున్నాడు. అతను మోసం చేసిన మహిళ ఢిల్లీ వెళ్లి… తనకు న్యాయం చేయమంటూ అక్కడి కోర్టుని ఆశ్రయించింది. ఈ కేసుపై దర్యాప్తు జరపాల్సిందిగా ఢిల్లీ కోర్టు ఇటీవల ముంబయి పోలీసులను ఆదేశించింది. దాంతో ముంబయి పోలీసులు యోగితాబాలి, మహాక్షయ్ లపై రేప్, మోసం, అబార్షన్ కు గురిచేయటం తదితర అభియోగాలతో కేసు నమోదు చేశారు.