Telugu Global
National

సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ లో చీలిక...

సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి ఎన్వీ రమణపై ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేస్తూ ఏపీ సీఎం జగన్ రాసిన లేఖ వ్యవహారం రోజు రోజుకీ కొత్త మలుపు తిరుగుతోంది. ఇటీవల ఎన్వీ రమణకు మద్దతుగా తీర్మానం చేసిన సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్లో చీలిక వచ్చింది. ఏకంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ దవే ఈ తీర్మానాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. ముఖ్యమంత్రి లేఖలోని అంశాలపై విచారణ జరపాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. ఆ తీర్మానాన్ని తాను తిరస్కరిస్తున్నానంటూ బార్ అసోసియేషన్ కు […]

సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ లో చీలిక...
X

సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి ఎన్వీ రమణపై ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేస్తూ ఏపీ సీఎం జగన్ రాసిన లేఖ వ్యవహారం రోజు రోజుకీ కొత్త మలుపు తిరుగుతోంది. ఇటీవల ఎన్వీ రమణకు మద్దతుగా తీర్మానం చేసిన సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్లో చీలిక వచ్చింది. ఏకంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ దవే ఈ తీర్మానాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు.

ముఖ్యమంత్రి లేఖలోని అంశాలపై విచారణ జరపాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. ఆ తీర్మానాన్ని తాను తిరస్కరిస్తున్నానంటూ బార్ అసోసియేషన్ కు ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్ రాసిన లేఖలోని ఆరోపణలను ముందుగానే ఖండించడం సరైన చర్య కాదని, విచారణ ద్వారానే ఆ అంశాలు వాస్తవాలా లేదా అన్నది తేలుతుందని చెప్పారు.

దీంతో సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్లో అందరూ ఆ తీర్మానానికి మద్దతు తెలపలేదనే విషయం స్పష్టమైంది. మరి హడావిడిగా బార్ అసోసియేషన్ తరపున ఎందుకు ఆ తీర్మానాన్ని విడుదలచేశారు, అసలు అధ్యక్షుడికి తెలియకుండా, ఆయన నిర్ణయం తీసుకోకుండా అసోసియేషన్ తరపున ఎవరు తీర్మానం చేశారు, ఎవరి మెప్పుకోసం ఈ పనిచేశారనే విషయం తేలాల్సి ఉంది.

ఆరోపణ అంటూ వచ్చిన తర్వాత ఎంతటివారైనా విచారణ ఎదుర్కోవాల్సిందే. భారత రాజ్యాంగ మౌలిక సూత్రం ఇదే. అయితే.. అసలు విచారణ అంటూ జరగకుండానే.. ఎన్వీ రమణకు మద్దతుగా న్యాయవాదుల బెంచ్ తీర్మానం చేయడమే ఇక్కడ విడ్డూరం. పైగా ఆరోపణలు చేసిన వ్యక్తిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం ఎంతవరకు న్యాయ సమ్మతమో న్యాయవాదులే తేల్చుకోవాలి. ఈ సమయంలో సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్లో స్పష్టమైన చీలిక వచ్చింది.

అసోసియేషన్ తీర్మానం అందరి నిర్ణయం కాదనే విషయం స్పష్టమైంది. ఏకంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ దవే ఇలా విభేదించడం మరింత సంచలనంగా మారింది. అసోసియేషన్ నిర్ణయానికి అధ్యక్షుడి మద్దతు లేదని తేలిన తర్వాత ఇక ఆ తీర్మానానికి విలువ ఉంటుందా లేదా అనే విషయాన్ని అసోసియేషన్ నిర్ణయానికే వదిలేయాలి.

First Published:  18 Oct 2020 9:23 PM GMT
Next Story