Telugu Global
National

వర్షానికి వరదకు తేడా తెలుసా లోకేష్? " మంత్రి కన్నబాబు ధ్వజం..

రాష్ట్రంలో భారీ వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతునీ ప్రభుత్వం ఆదుకుంటుందని, ఈమేరకు సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలిచ్చారని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. నష్ట నివారణ, సహాయక చర్యల్లో ప్రభుత్వం బిజీగా ఉంటే, విమర్శలు చేయడంలో మాత్రం ప్రతిపక్షం బిజీగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. వర్షానికి, వరదలకు తేడా తెలియని లోకేష్.. కష్టకాలంలో రాజకీయ లాభం కోసం కాకి లెక్కలు చెబుతూ, సవాళ్లు విసురుతున్నారని మండిపడ్డారు. రైతుల శాపం తగిలింది కాబట్టే.. తెలుగుదేశం […]

వర్షానికి వరదకు తేడా తెలుసా లోకేష్?  మంత్రి కన్నబాబు ధ్వజం..
X

రాష్ట్రంలో భారీ వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతునీ ప్రభుత్వం ఆదుకుంటుందని, ఈమేరకు సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలిచ్చారని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు.

నష్ట నివారణ, సహాయక చర్యల్లో ప్రభుత్వం బిజీగా ఉంటే, విమర్శలు చేయడంలో మాత్రం ప్రతిపక్షం బిజీగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. వర్షానికి, వరదలకు తేడా తెలియని లోకేష్.. కష్టకాలంలో రాజకీయ లాభం కోసం కాకి లెక్కలు చెబుతూ, సవాళ్లు విసురుతున్నారని మండిపడ్డారు. రైతుల శాపం తగిలింది కాబట్టే.. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిందని అన్నారాయన.

రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి.. రూ. 87 వేల కోట్లను, 24 వేల కోట్లు చేసి, చివరికి 15 వేల కోట్లు ఎగ్గొట్టి, 14 వేల కోట్లు ఇచ్చింది మీరు కాదా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు స్కీములు, స్కాముల చరిత్ర తెలుసు కాబట్టే రైతులు టీడీపీని, చంద్రబాబును ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారని అన్నారు. రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిల్ని కూడా తమ ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు.

కేవలం మీడియా అటెన్షన్ కోసమే లోకేష్.. ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారని, చంద్రబాబు కొడుకు అనే హోదా లేకపోతే అసలు లోకేషన్ ని ఎవరు గుర్తుంచుకుంటారని అన్నారు. రైతులంటే అమరావతి రైతులు, టీడీపీ నాయకుల చుట్టూ ఉండేవారు మాత్రమే కాదని, రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాలకు వచ్చి చూస్తే.. అసలు రైతులంటే ఎవరు? వారికి ఎలాంటి సాయం అందుతోంది, ప్రభుత్వం వారికోసం ఏం చేస్తోంది అనే విషయాలు తెలుస్తాయని సూచించారు కన్నబాబు.

రాష్ట్రంలోని 9 జిల్లాల్లో పంట నష్టం జరిగిందని, ముఖ్యమంత్రి ఆదేశాలతో వరద ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనాకు అధికారుల బృందాలు పర్యటిస్తున్నాయని, వరద పూర్తిగా తగ్గాక నివేదికలు అందిస్తారని ఆయన చెప్పారు. ముంపుబారిన పడి నిరాశ్రయులైనవారికి రెండు పూటలా భోజన సదుపాయం, పడవలు ఏర్పాటు చేశామని, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులు అందిస్తున్నామని చెప్పారు కన్నబాబు.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక 225కోట్లకు పైగా ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేస్తే.. లోకేష్ కేవలం 25లక్షలు మాత్రమే ఇచ్చారని చెప్పడం ఆయన అవగాహన రాహిత్యం అని ఎద్దేవా చేశారు. కేవలం చెరకు రైతులకు చంద్రబాబు పెట్టిన బకాయిలే తాము 55 కోట్ల రూపాయలు విడుదల చేశామని గుర్తు చేశారు.

వైసీపీ వచ్చాక 750మంది రైతులు మరణించారంటూ లోకేష్ కాకి లెక్కలు చెప్పడం సరికాదన్నారు. అమరావతి రైతులపట్ల తమకు సానుభూతి ఉందని, వారంతా చంద్రబాబు చేతిలో మోసపోయారని, వారిని ఇంకా భ్రమల్లోనే ఉంచుతోంది చంద్రబాబేనని చెప్పారు. ఇప్పటికీ అమరావతి రైతుల్ని రాజకీయంగా వాడుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

ఇప్పటికైనా లోకేష్ వాస్తవాలు గ్రహించాలని, సీఎం జగన్ పై అవాకులు చవాకులు పేలడం మానుకోవాలని కన్నబాబు హితవు పలికారు.

First Published:  19 Oct 2020 10:04 PM GMT
Next Story