Telugu Global
National

జగన్ లేఖపై సుప్రీంకోర్టు విచారణ జరపాలి... " మాజీ ప్రధాన న్యాయమూర్తి ఏపీ షా

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ ప్రధాన న్యాయమూర్తికి ఏపీ సీఎం జగన్ రాసిన లేఖను తేలిగ్గా తీసుకోలేమని, కచ్చితంగా ఆ లేఖ ఆధారంగా విచారణ జరిగి తీరాల్సిందేనని అన్నారు ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఏపీ షా. ఒక రాజ్యాంగ వ్యవస్థ, మరో రాజ్యాంగ వ్యవస్థపై ఆరోపణలు చేసిందని.. ఈ అంశానికి గోప్యత అవసరం లేదని, బహిరంగంగానే విచారణ జరగాలని అన్నారు. సుప్రీంకోర్టు అంతర్గత విచారణ ప్రక్రియ లేదా, సీజేఐ ఆధ్వర్యంలోనే […]

జగన్ లేఖపై సుప్రీంకోర్టు విచారణ జరపాలి...  మాజీ ప్రధాన న్యాయమూర్తి ఏపీ షా
X

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ ప్రధాన న్యాయమూర్తికి ఏపీ సీఎం జగన్ రాసిన లేఖను తేలిగ్గా తీసుకోలేమని, కచ్చితంగా ఆ లేఖ ఆధారంగా విచారణ జరిగి తీరాల్సిందేనని అన్నారు ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఏపీ షా.

ఒక రాజ్యాంగ వ్యవస్థ, మరో రాజ్యాంగ వ్యవస్థపై ఆరోపణలు చేసిందని.. ఈ అంశానికి గోప్యత అవసరం లేదని, బహిరంగంగానే విచారణ జరగాలని అన్నారు. సుప్రీంకోర్టు అంతర్గత విచారణ ప్రక్రియ లేదా, సీజేఐ ఆధ్వర్యంలోనే బహిరంగ విచారణ జరగాలని కోరారు ఏపీ షా. సీఎం జగన్ రాసిన లేఖలో రెండు ప్రధాన అంశాలున్నాయని చెప్పారు షా.

వాటిలో ఒకటి జస్టిస్ ఎన్వీరమణ కుమార్తెల భూ లావాదేవీల వ్యవహారం. ఇప్పటికే వారిద్దరిపై ఎఫ్ఐర్ నమోదైందని షా గుర్తు చేశారు. రెండోది, అతి ముఖ్యమైనవి ఎన్వీరమణపై నేరుగా జగన్ చేసిన ఆరోపణలు. ఆయనతోపాటు హైకోర్టులోని కొంతమంది జడ్జిల పేర్లను కూడా జగన్ తన లేఖలో పేర్కొన్నారు. జగన్ లేఖను తప్పుపట్టాల్సిన అవసరం కానీ, అభ్యంతరం తెలపాల్సిన సందర్భం కానీ లేదని అన్నారు షా.

ప్రజల్లో ఉన్న అనుమానాలనే ముఖ్యమంత్రి తన లేఖలో పేర్కొన్నారని, అందుకే వాటిపై విచారణ జరగాలని అన్నారు. ఒకవేళ విచారణలో జగన్ ఉద్దేశపూర్వకంగానే జడ్జిలపై ఆరోపణలు చేశారని తేలితే ఆయనపై కూడా చర్య తీసుకునే అవకాశం ఉందని, అందుకే తాను విచారణ జరగాలంటున్నానని చెప్పారు షా. న్యాయ వ్యవస్థ ఈ అంశంలో మౌనంగా ఉండటం మంచిది కాదని చెప్పారాయన.

ఏపీ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడాన్ని అసాధారణమైన విషయంగా చెబుతున్న జస్టిస్ షా.. వాస్తవాలను గుర్తించకుండా తల తిప్పుకోవడమేనన్నారు. దిక్కుతోచని స్థితిలో తల ఇసుకలో పెట్టే నిప్పుకోడి లాగా ఏపీ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చిందని ఉదహరించారు. న్యాయమూర్తుల నియామకాలను చూసే కొలీజియం వ్యవస్థపై కూడా జస్టిస్ షా నిప్పులు చెరిగారు. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు.. న్యాయమూర్తుల నియామకం మరింత పారదర్శక వ్యవస్థ ద్వారా జరగాలనే అంశం తెరపైకి వస్తుందని అన్నారు.

ఏపీ సీఎం జగన్ లేఖను ఖండించడం ద్వారా ఒరిగేదేమీ లేదంటున్న షా, సుప్రీంకోర్టు ఈ విషయంలో ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. జడ్జీలపై వచ్చిన ఆరోపణలను విచారించేందుకు జవాబుదారి కలిగిన యంత్రాంగముండాలని, న్యాయవ్యవస్థపై రోజురోజుకు పెరిగిపోతున్న ఆరోపణలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే.. న్యాయవ్యవస్థలో సంస్కరణలు అత్యంత అవసరమని గుర్తు చేశారు.

First Published:  21 Oct 2020 3:40 AM GMT
Next Story