కరోనా… అంచనాలకు అందటం లేదు !

కరోనా మనకు పూర్తిగా కొత్త వైరస్ కావటంతో… దానికి చికిత్సను అందిస్తూనే దాని గురించిన వివరాలను వైద్యులు తెలుసుకుంటున్నారు. ప్రజలకు చెబుతున్నారు.

అయితే ఎప్పటికప్పుడు వారి అభిప్రాయాలు మారిపోయేలా మరింత కొత్తగా కనబడుతోంది కోవిడ్ 19. ఇప్పటివరకు బిపి, షుగర్ లాంటి జీవనశైలి సమస్యలున్నవారికి దీనివలన మరింత హాని కలుగుతుందని భావిస్తున్నాం కదా…. అయితే ఆ అభిప్రాయం తప్పని, అలాంటి సమస్యలు లేనివారు సైతం కోవిడ్ కారణంగా మరణిస్తున్నారని తెలుస్తోంది.

ఢిల్లీలో కరోనాతో మరణించిన నలభై ఏళ్ల లోపు వయసున్నవారిలో సగం మందికి పైగా షుగర్ బిపి లాంటి సమస్యలు లేనివారేనని లెక్కలు చెబుతున్నాయి.

మార్చి 1 సెప్టెంబరు 30 మధ్యకాలంలో ఢిల్లీలో కరోనాతో 5,283 మంది మరణించారు. వీరిలో 650 మంది నలభై ఏళ్ల లోపు వయసువారు. వీరిలో 254మంది అంటే దాదాపు 43శాతం మందిలో జీవనశైలి అనారోగ్యాలు… షుగర్, బిపి లాంటివి ఉన్నాయి. మిగిలిన 57శాతం మంది ఇలాంటి సమస్యలేమీ లేని ఆరోగ్యవంతులు.

మే మూడవ వారం వరకు ఢిల్లీలో… కరోనా మరణాలు… 85శాతం వరకు షుగర్ బిపి వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారిలో సంభవిస్తున్నట్టుగా నమోదైంది. అప్పట్లో మరణించిన పేషంట్ల తాలూకూ… వయసు, అనారోగ్యాలకు సబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ వివరాలు ఇచ్చాక… ఇప్పుడు 55 శాతం మంది ఇతర అనారోగ్యాల తీవ్రత కోవిడ్ కి తోడై మరణిస్తున్నారని తేలింది. అంటే 45 శాతం మంది ఆరోగ్యంగా ఉండి కూడా కోవిడ్ తో ప్రాణాలు కోల్పోతున్నారు.

కోవిడ్ మరణాల్లో సగానికి పైగా… యాభై-డెభై ఏళ్ల మధ్య వయసున్నవారిలోనే సంభవిస్తున్నాయి. కోవిడ్ తో మరణిస్తున్నవారిలో ఎక్కువశాతం మంది అనారోగ్యాలతో బాధపడుతున్న పెద్దవయసువారే ఉంటున్నారని, చిన్నవయసు వారిలో అలాంటి సమస్యలు తక్కువగా ఉంటాయని ఎయిమ్స్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ నీరజ్ నిశ్చల్ అంటున్నారు.

కోవిడ్ ని మరింత తీవ్రతరం చేస్తున్న అంశాల్లో అనారోగ్యాలతో పాటు జీవనశైలి సమస్యలు, సరైన పోషణ లేకపోవటం కూడా ఉంటున్నాయని ఆయన అన్నారు. ఏదిఏమైనా కోవిడ్ గురించి మనం అంచనా వేయగలిగిన అంశం… ‘అది మన అంచనాలకు అందనిది’… అనేది ఒక్కటేనని నీరజ్ అన్నారు.