ఇంటిముందు…  అమ్మాయి పేరుతో నేమ్ ప్లేట్ !

ఉత్తర ప్రదేశ్ పేరు చెబితేనే భయపడేలా అక్కడ ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మొన్నటి హథ్రాస్ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగటం, ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ జిల్లాలోని చాలా గ్రామాల్లో ఒక వినూత్నమైన మార్పు చోటు చేసుకుంది. సాధారణంగా మహిళలపై జరిగే హింసకు పురుషాధిక్య సమాజమే ప్రధాన కారణమై ఉంటుంది. మనది స్త్రీపురుషుల మధ్య వివక్ష చాలా తీవ్రంగా ఉన్న సమాజం. అందుకు నిదర్శనమైన అంశాలు అడుగడుగునా కనబడుతుంటాయి. ఉదాహరణకు ఇంట్లో ఉన్న మగవారి పేర్లతోనే ఇంటిముందు నేమ్ ప్లేట్లు ఉంటాయి. ఉత్తర ప్రదేశ్ లో ఇప్పుడు ఈ పేర్ల బోర్డుల్లోనే మార్పులు కనబడుతున్నాయి.

అమ్మాయిలకు గుర్తింపు, గౌరవం, భద్రత, సమానత్వం… ఇవన్నీ దక్కాలనే ఆకాంక్షని వెల్లడిస్తూ… అందుకు ప్రతీకగా ముజఫర్ నగర్ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు ఇప్పుడు తమ ఇళ్లముందు… తమ కూతుళ్ల పేర్లతో నేమ్ ప్లేట్లను తయారుచేయించి ఉంచుతున్నారు. మహిళలు, పిల్లల సంక్షేమ శాఖ సిబ్బంది గ్రామాలకు వెళ్లి చేస్తున్న ప్రచారం వలన ప్రజల్లో ఈ తరహా మార్పు కనబడుతోంది. చాలామంది తమ ప్రియమైన కూతుళ్ల పేర్లను ఇంటిముందు నేమ్ ప్లేట్లపై ముద్రించేందుకు ఇష్టపడుతున్నారని ఆ శాఖ ఉద్యోగులు అంటున్నారు. అలాగే కూతుళ్లు లేని ఇళ్ల ముందు… ఇంట్లో ఉండే తల్లి, చెల్లి, భార్య… ఇలా ఏ బంధంలో ఉన్న స్త్రీ ఉంటే ఆమె పేరుని రాయమని అధికారులు చెబుతున్నారు.

ఇంతకుముందు పంజాబ్, హర్యానాల్లో  ఇలాంటి ప్రచారమే చేశారు. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో ఈ తరహా ప్రచారం చేస్తున్నారు. హర్యానాలో 2015లో గ్రామ పంచాయితీ సభ్యులు తమ గ్రామాల్లోని ఇంటింటికీ వెళ్లి… ఆయా ఇళ్లలోని కూతుళ్ల పేర్లు, వారి ఈ మెయిల్ ఐడి లు ఉన్న బోర్డులను ఇంటిముందు పెట్టే ఏర్పాట్లు చేశారు. తమ ఆడపిల్లలను తామే రక్షించుకోవాలనే చైతన్యం ప్రజల్లో రావటం, వారి భద్రత విషయంలో మరింత అవగాహన, అప్రమత్తత పెరగటం చాలా అవసరం కనుక దీనిని ఒక మంచి ప్రయత్నంగా చెప్పవచ్చు.