Telugu Global
National

బాబుకి రివర్స్ లో తగిలిన పునాదిరాళ్ల వార్షికోత్సవం...

ఐదేళ్ల క్రితం అమరావతికి శంకుస్థాపన చేశారు… ఇంతవరకు అక్కడ ఒక్క పని కూడా సవ్యంగా జరగలేదు. ఇదీ చంద్రబాబు అండ్ టీమ్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే ఐదేళ్ల నిర్లక్ష్యంలో బాబు వాటా మూడున్నరేళ్లు. దీన్ని ప్రధానాస్త్రంగా చేసుకుని వైసీపీ నేతలు చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. రాజధాని ప్రాంతంలో నిరసనలు చేపట్టిన వారంతా ప్రశ్నించాల్సింది చంద్రబాబుని కానీ, జగన్ ని కాదని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఐదేళ్ల క్రితం అమరావతికి పునాది వేసిన బాబు తన […]

బాబుకి రివర్స్ లో తగిలిన పునాదిరాళ్ల వార్షికోత్సవం...
X

ఐదేళ్ల క్రితం అమరావతికి శంకుస్థాపన చేశారు… ఇంతవరకు అక్కడ ఒక్క పని కూడా సవ్యంగా జరగలేదు. ఇదీ చంద్రబాబు అండ్ టీమ్ చేస్తున్న ప్రధాన ఆరోపణ.

అయితే ఐదేళ్ల నిర్లక్ష్యంలో బాబు వాటా మూడున్నరేళ్లు. దీన్ని ప్రధానాస్త్రంగా చేసుకుని వైసీపీ నేతలు చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. రాజధాని ప్రాంతంలో నిరసనలు చేపట్టిన వారంతా ప్రశ్నించాల్సింది చంద్రబాబుని కానీ, జగన్ ని కాదని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

ఐదేళ్ల క్రితం అమరావతికి పునాది వేసిన బాబు తన హయాంలోనే రాజధాని నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు బొత్స. ఇన్ సైడర్ ట్రేడింగ్ కి అమరావతి అనే అందమైన పేరు పెట్టుకుని కాలక్షేపం చేశారని విమర్శించారు. లక్ష కోట్ల అంచనా అంటూ 5వేలకోట్లు మాత్రమే ఖర్చు చేసిన చంద్రబాబు దానిలో ఎంత దిగమింగారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

బాబు ఖర్చు చేసిన 5వేల కోట్లలో 500కోట్లు కేవలం కన్సల్టెంట్ సేవలకే ఖర్చు చేశారని అన్నారు. అమరావతి పేరుతో మీడియాలో చూపించే బుద్ధుడి బొమ్మ కూడా వైఎస్ఆర్ హయాంలో నిర్మించిన కాలచక్రం నాటిదేనని గుర్తు చేసిన బొత్స, పునాది మేము వేశాం, రాజధాని మీరు కట్టండి అనేదే చంద్రబాబు విధానం అని ఎద్దేవా చేశారు.

అమరాతిలో అన్నీ తాత్కాలిక నిర్మాణాలు చేపట్టిన బాబు హైదరాబాద్ లో మాత్రం మూడున్నరేళ్లలో తన ఇంటిని అందంగా కట్టుకున్నారంటూ మండిపడ్డారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా ఎవరెవరు భూములు కొన్నారనే విషయం మీద జరుగుతున్న చర్చని, హైకోర్ట్ ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌ ని డైవర్ట్ చేయడానికే పునాది వేసిన రోజు అంటూ కెమెరా షో పెట్టారని అన్నారు బొత్స. జరగని పెళ్ళికి బాజాలేంటి? కట్టని రాజధాని గురించి కన్నీళ్ళేంటి? అని చెణుకులు విసిరారు బొత్స.

అమరావతిలో టీడీపీతో కలసి ఉత్తరాంధ్ర, రాయలసీమ వ్యతిరేక మీడియా నడుపుతున్న ఆగడం తప్ప అక్కడ ఉద్యమం లేదని అన్నారు మంత్రి బొత్స. రాజధాని పరిధిలో ఉన్న మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాలను సీఎం జగన్ త్వరలోనే మున్సిపల్ కార్పోరేషన్‌గా ప్రకటించబోతున్నారని… విజయవాడ-గుంటూరు నగరాలకు ధీటుగా అమరావతిని అభివృద్ధి చేయబోతున్నామని చెప్పారు.

అమరావతి పరిధిలోని 29 గ్రామాలను కూడా అభివృద్ది చేసి, భూములిచ్చిన నిజమైన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్‌లను అందిస్తామని హామీ ఇచ్చారు. శాసన రాజధానిగా అమరావతిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. వైసీపీకి ఇదే ఆఖరు ఛాన్స్ అంటూ బాబు కలలు కంటున్నారని, రాష్ట్ర ప్రజలంతా పదికాలాలపాటు జగన్ ఒక్కరే సీఎం గా ఉండాలనుకుంటున్నారని చెప్పారు.

ఇక అమరావతికి మద్దతునిస్తున్న కమ్యూనిస్ట్ లు పేదలవైపా, లేక భూస్వాములవైపా అని కూడా ప్రశ్నించారు బొత్స. వైఎస్ఆర్ బీమా పథకంపై అచ్చెన్నాయుడి మాటలు అర్థరహితమని కొట్టిపారేశారు బొత్స. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చంద్రన్న బీమాని గత ప్రభుత్వం అమలు చేసిందని, ఇప్పుడు కేంద్రం సాయం ఇవ్వకుండా వెనకడుగేసినా.. వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ప్రీమియం భారాన్ని భరిస్తోందని చెప్పారు.

పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని కూడా కోర్టు కేసులతో అడ్డుకుంటున్న చరిత్ర చంద్రబాబుదేనన్నారు బొత్స. పేదల కోపానికి బాబు మాడి మసైపోతారంటూ శాపనార్థాలు పెట్టారు.

ఎన్నికల కమిషన్ నిధులకోసం కోర్టుమెట్లెక్కడాన్ని కూడా బొత్స ఆక్షేపించారు. బడ్జెట్ కేటాయింపుల ప్రకారం ఎలక్షన్ కమిషన్ కు నిధులు ఇస్తున్నామని, అదనంగా కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలని అన్నారు. ఎన్నికల కమిషన్ ని ఒక వ్యవస్థగా తమ ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పారు.

First Published:  22 Oct 2020 7:55 PM GMT
Next Story