Telugu Global
National

ఆరోగ్య శాఖ జబ్బుకి విజిలెన్స్ వైద్యం చేస్తున్న జగన్...

వైద్య ఆరోగ్య శాఖలో జరుగుతున్న అక్రమాలపై సీఎం జగన్ కన్నెర్ర చేసినట్టు తెలుస్తోంది. అవినీతి రహిత పాలన అందిస్తానంటూ తాను ఓవైపు చెబుతున్నా.. అధికారుల్లో కొంతమంది ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని ఆరోపణలు అందడంతో.. జగన్ తీవ్రంగా స్పందించారని అంటున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(DME) గా పనిచేస్తున్న వెంకటేశం చేతివాటం, వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు రావడంతో.. ఈ ఎపిసోడ్ మొత్తానికి సంబంధించి సీఎం జగన్ విజిలెన్స్ ఎంక్వయిరీకి ఆదేశించినట్టు తెలుస్తోంది. వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన […]

ఆరోగ్య శాఖ జబ్బుకి విజిలెన్స్ వైద్యం చేస్తున్న జగన్...
X

వైద్య ఆరోగ్య శాఖలో జరుగుతున్న అక్రమాలపై సీఎం జగన్ కన్నెర్ర చేసినట్టు తెలుస్తోంది. అవినీతి రహిత పాలన అందిస్తానంటూ తాను ఓవైపు చెబుతున్నా.. అధికారుల్లో కొంతమంది ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని ఆరోపణలు అందడంతో.. జగన్ తీవ్రంగా స్పందించారని అంటున్నారు.

డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(DME) గా పనిచేస్తున్న వెంకటేశం చేతివాటం, వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు రావడంతో.. ఈ ఎపిసోడ్ మొత్తానికి సంబంధించి సీఎం జగన్ విజిలెన్స్ ఎంక్వయిరీకి ఆదేశించినట్టు తెలుస్తోంది. వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన నియామకాలు, బదిలీలు, ప్రమోషన్లు.. అన్నిటికీ అవినీతి మకిలి అంటుకున్నట్టు తెలుస్తోంది.

డీఎంఈ స్థాయిలోనే నోట్ల కట్టలు చేతులు మారేవని, అవసరమైన చోట పోస్టింగ్ వచ్చి పడేదని ఆరోపణలు వచ్చాయి. కరోనా కష్టకాలంలో జరిగిన నూతన నియామకాలన్నిటితో సదరు డీఎంఈ కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని అంటున్నారు. కౌన్సెలింగ్ లో ఖాళీలు చూపించకుండానే బదిలీలు చేయడం.. బదిలీ ప్రక్రియ పూర్తయ్యాక డబ్బులిచ్చినవారికి అడిగినచోట పోస్టింగ్ ఇవ్వడం చేశారు డీఎంఈ. అర్హత లేని వారికి ప్రోమోషన్లు ఇచ్చి, అర్హతలున్న వారికి మొండిచెయ్యి చూపించారు.

బయో కెమిస్ట్రీ లాంటి డిపార్ట్ మెంట్లలో అర్హులైన వైద్యులను పక్కన బెట్టి, కేవలం ఎమ్మెస్సీ లాంటి డిగ్రీలు చదివినవారికి 10లక్షలు లంచం తీసుకుని పోస్టింగ్ లు ఇప్పించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అవినీతి, అక్రమాల కేసుల్ని కూడా లంచం తీసుకుని మాఫీ చేశారని సీఎంఓకి ఫిర్యాదులందాయి.

కర్నూలు మెడికల్ కాలేజీలో డాక్టర్ నారాయణ రావు అనే ప్రొఫెసర్ ఎన్నో ఏళ్ళ నుంచి విధులకు హాజరు కాకుండానే ఇటీవల మొత్తం జీతం తీసుకున్నారు. ఆయన మాజీ మంత్రి నారాయణకు సమీప బంధువు. ఈ వ్యవహారంపై డీఎంఈకి ఫిర్యాదులందినా కూడా విచారణ పక్కనపెట్టారు. మొత్తం జీతం శాంక్షన్ చేసి సహచర ఉద్యోగులకు షాకిచ్చారు. ఈ వ్యవహారంలో కూడా పెద్ద మొత్తం చేతులు మారినట్టు తెలుస్తోంది.

డీఎంఈ ఆఫీస్ లో చిన్న ఫైలు కదలాలన్నా చేయి తడపాల్సిందే. బ్రోకర్లను ఏర్పాటు చేసుకొని మరీ రాష్ట్రవ్యాప్తంగా కలెక్షన్లు చేసుకోవడం చూసి ఉన్నతాధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు గుర్తింపే లేని ప్రభుత్వ వైద్యుల సంఘానికి కన్వీనర్ అవతారమెత్తిన ఒక వైద్యుడు డీఎంఈకి దళారిగా పనిచేస్తున్నారు.

డీఎంఈ వ్యవహారం సంబంధిత మంత్రి ఆళ్ల నానికి కూడా తలనొప్పిగా మారింది. మంత్రి చెప్పినా కూడా డబ్బులిస్తేనే పని చేస్తానంటూ తెగేసి చెప్పేవారట డీఎంఈ. చరిత్రలో ఏ ప్రభుత్వ హయాంలో లేనట్టు వైద్య శాఖలో అత్యథిక నియామకాలు చేపట్టిన ముఖ్యమంత్రికి ఈ అవకతవకల వ్యవహారం అపఖ్యాతి తెచ్చిపెట్టింది. అందుకే విజిలెన్స్ విచారణకు ఆయన ఆదేశించారు. డీఎంఈ అక్రమాలపై విచారణ జరుగుతుందన్న విషయం బైటకు పొక్కడంతో బాధితులంతా ఫిర్యాదులతో సీఎంఓ ముందు క్యూ కట్టారట.

ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్..(APMSIDC) లో ముఖ్య అధికారి కూడా ఇటీవల కరోనా వ్యవహారాల్లో పెద్ద మొత్తంలో వెనకేసుకున్నాడని ఆరోపణలొస్తున్నాయి. అయితే వైద్య ఆరోగ్య శాఖలో ఈ అవినీతి వెనుక బయటకు కనిపించే ఈ వైద్య అధికారుల హస్తమే కాకుండా సీఎంఓ లో పనిచేసిన ఒక ముఖ్య అధికారి హస్తం కూడా ఉన్నట్లు తెలిసింది.

First Published:  23 Oct 2020 9:48 AM GMT
Next Story