Telugu Global
National

అక్రమాల పునాదులపై గీతం యూనివర్సిటీ...

పేరుకి గాంధీ ఇన్ స్టిట్యూట్.. కానీ ఆ విద్యాసంస్థ పునాదులు మాత్రం అక్రమాలపై పైకి లేచాయి. ఇప్పటికీ ఆక్రమించుకున్న స్థలంలోనే కార్యకలాపాలు సాగుతున్నాయి. గీతం యూనివర్సిటీ వ్యవస్థాపకులు ఎంవీవీఎస్ మూర్తి టీడీపీ తొలితరం నాయకుల్లో ఒకరు. ఆయన మనవడు భరత్, నందమూరి బాలకృష్ణకి చిన్నల్లుడు. టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన యువ నాయకుడు. ఈ మాత్రం రిలేషన్ చాలదా.. ప్రభుత్వం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోడానికి. అదే పనిచేసింది గీతం యాజమాన్యం. టీడీపీ హయాంలో ఆక్రమణల […]

అక్రమాల పునాదులపై గీతం యూనివర్సిటీ...
X

పేరుకి గాంధీ ఇన్ స్టిట్యూట్.. కానీ ఆ విద్యాసంస్థ పునాదులు మాత్రం అక్రమాలపై పైకి లేచాయి. ఇప్పటికీ ఆక్రమించుకున్న స్థలంలోనే కార్యకలాపాలు సాగుతున్నాయి. గీతం యూనివర్సిటీ వ్యవస్థాపకులు ఎంవీవీఎస్ మూర్తి టీడీపీ తొలితరం నాయకుల్లో ఒకరు. ఆయన మనవడు భరత్, నందమూరి బాలకృష్ణకి చిన్నల్లుడు. టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన యువ నాయకుడు.

ఈ మాత్రం రిలేషన్ చాలదా.. ప్రభుత్వం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోడానికి. అదే పనిచేసింది గీతం యాజమాన్యం. టీడీపీ హయాంలో ఆక్రమణల పర్వం కొనసాగించి దానిపై సక్రమం అనే ముద్ర వేయించుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. కొంతవరకు విజయవంతం అయింది. అయితే ఇంకా కొనసాగించిన ఆక్రమణల పర్వంలో చివరకు వ్రతం చెడి, ఫలితం దక్కకుండా పోవడంతో విశాఖలో 40.51 ఎకరాల ఆక్రమణల నుంచి వైదొలగాల్సి వస్తోంది.

గీతం అక్రమాలపై విశాఖ ఆర్డీవో ఇచ్చిన నివేదికపై సిట్ బృందం కూడా ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. ఆక్రమణలు నిజమేనని తేలడంతో ప్రభుత్వం ఈ అక్రమాలపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది.

విశాఖ ఆర్డీవో ఇచ్చిన నివేదికలో కీలక అంశాలు ఇవీ..

తొలిసారిగా 1981లో విశాఖలోని రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో 71 ఎకరాల 15 సెంట్ల భూమికోసం గీతం యాజమాన్యం అప్పటి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించకుండానే 14ఎకరాల్లో భవనాలు నిర్మించుకుని 57ఎకరాలను ఖాళీగా ఉంచింది గీతం యాజమాన్యం.

1996లో అధికారులు గీతం వర్శిటీకి కొంత భూమి చాలని, మిగతా భూమిని స్వాధీనం చేసుకునేందుకు నోటీసులిచ్చింది. 1998లో స్వాధీనం చేసుకుంది కూడా. ఆ తర్వాత అదే ఏడాది… టీడీపీ ప్రభుత్వం నామమాత్రపు ధరతో భూముల్ని గీతం యాజమాన్యానికి ధారాదత్తం చేసింది. అయితే అది కూడా చాలక ఆ తర్వాత గీతం యాజమాన్యం మరిన్ని ఆక్రమణలకు తెరతీసింది.

ఆక్రమణల్లో వెలసిన నిర్మాణాలను కూల్చి వేయాలని స్థానిక ఎమ్మార్వో ఆదేశాలివ్వగా.. 2004లో కోర్టుని ఆశ్రయించి తనకు అనుకూలంగా రక్షణ పొందింది యాజమాన్యం. చివరకు 2005లో ప్రభుత్వం ఆక్రమిత స్థలాన్ని స్వాధీనం చేసుకుని నోటీస్ బోర్డ్ లు కూడా పెట్టింది. ఆ తర్వాత మళ్ళీ గీతం కోర్టుకు వెళ్ళి స్టే పొంది ఆ భూమిని నిలుపుకుంది. 2014లో రాష్ట్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలకోసం సీసీఎల్ఏ.. గీతం ఆక్రమణలో ఉన్న భూమిని కేటాయించింది. దీనిపై మళ్లీ గీతంకు అనుకూలంగా హైకోర్టు స్టే ఇవ్వడంతో వ్యవహారం మొదటికొచ్చింది.

టీడీపీ హయాంలో గీతం గీచింది గీత, గీతం ఆడింది ఆట అన్నట్టుగా సాగిపోయింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చాక వ్యవహారం పూర్తిగా బైటపడింది. విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చిన జగన్ ప్రభుత్వం అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకోసం సీసీఎల్ఏ కేటాయించిన భూమిపై దృష్టిసారించింది. అదంతా ప్రస్తుతం గీతం ఆక్రమణలో ఉందని తేలడంతో ఆర్డీవో పరిధిలో విచారణకు ఆదేశించింది. ఆర్డీవో ఇచ్చిన నివేదిక ప్రకారం 40.51ఎకరాల భూమి గీతం ఆక్రమణల్లో ఉంది.

ప్రభుత్వ లెక్కల ప్రకారం దీని విలువ ఎకరా రూ. 8.26కోట్లు, బహిరంగ మార్కెట్ లో 50కోట్ల పైమాటే. ఆర్డీవో నివేదికను సిట్ బృందం కూడా నిజమేనని నిర్థారించడంతో.. గీతంపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎలాగూ దీన్ని కూడా రాజకీయం చేయడానికి చంద్రబాబు సిద్ధంగా ఉంటారు కాబట్టి.. పక్కాగా నిబంధనల మేరకు గీతం యాజమాన్యాన్ని బైటకు నెట్టేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వానికి పైసా కట్టకుండా.. ఇన్నాళ్లూ ఆక్రమిత స్థలాల్లో విద్యాసంస్థలు నడపడమే కాకుండా.. ఇప్పుడు రాజకీయ కక్షసాధింపు అంటూ గీతం యాజమాన్యం నాటకానికి తెరతీస్తోంది. దీనికి చంద్రబాబు వత్తాసు కూడా ఉండటంతో ఈ ఆక్రమణల తొలగింపు వ్యవహారం రాష్ట్రవ్యాప్త సంచలనంగా మారుతోంది.

First Published:  22 Oct 2020 8:03 PM GMT
Next Story