Telugu Global
National

నోరుజారి సోషల్ మీడియాకు బలైన నిర్మలా సీతారామన్...

లోక్ సభ ఎన్నికల్లో విజయ దుందుభి మోగిస్తున్నా.. అసెంబ్లీ పోరులో మాత్రం ఎక్కడికక్కడ చతికిలపడుతోంది బీజేపీ. స్థానిక సమస్యల విషయంలో స్థానిక పార్టీలనే ప్రజలు నమ్మడం దీనికి ప్రధాన కారణం. అయితే ఈ దఫా.. రాష్ట్రాలను కూడా తమ హస్తగతం చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ ఎక్కడికక్కడ స్థానిక మత్రం పఠిస్తోంది. ఇందులో భాగంగానే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శక్తియుక్తుల్ని కూడగట్టి బరిలో దిగబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బీహార్ లో తమ పార్టీ మేనిఫెస్టోని […]

నోరుజారి సోషల్ మీడియాకు బలైన నిర్మలా సీతారామన్...
X

లోక్ సభ ఎన్నికల్లో విజయ దుందుభి మోగిస్తున్నా.. అసెంబ్లీ పోరులో మాత్రం ఎక్కడికక్కడ చతికిలపడుతోంది బీజేపీ. స్థానిక సమస్యల విషయంలో స్థానిక పార్టీలనే ప్రజలు నమ్మడం దీనికి ప్రధాన కారణం. అయితే ఈ దఫా.. రాష్ట్రాలను కూడా తమ హస్తగతం చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ ఎక్కడికక్కడ స్థానిక మత్రం పఠిస్తోంది. ఇందులో భాగంగానే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శక్తియుక్తుల్ని కూడగట్టి బరిలో దిగబోతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా బీహార్ లో తమ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేస్తూ ప్రసంగించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నోరు జారారు. ఇంగ్లిష్ లో దంచికొట్టే నిర్మల.. హిందీలో మాట్లాడాలంటే పదాలు కూడబలుక్కుంటారు. అయితే బీహార్ లో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసే సందర్భంలో ఆమె పూర్తిగా హిందీలోనే మాట్లాడి ఆకట్టుకున్నారు.

అంతా బాగానే ఉంది కానీ, కరోనా వ్యాక్సిన్ విషయానికొచ్చే సరికి బీహారీలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న వ్యాక్సిన్, త్వరలో అందుబాటులోకి వస్తుందని, వెంటనే దాన్ని బీహారీలందరికీ ఉచితంగా పంపిణీ చేస్తామని, బీహార్ లోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తేవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.

అయితే కరోనా వ్యాక్సిన్ పేరు చెప్పి, కేవలం బీహారీలను మాత్రమే గుర్తు చేయడంలో నిర్మల ఆంతర్యమేంటని సోషల్ మీడియాలో గొడవ మొదలైంది. బీజేపీకి సపోర్ట్ చేసే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ విషయాన్ని తేలిగ్గా తీసిపారేసినా.. సోషల్ మీడియాలో మాత్రం రోజంతా ఇదే గొడవ నడిచింది. చివరకు ప్రతిపక్షాలు కూడా సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్న నిర్మలా వ్యాఖ్యల్ని తప్పుబట్టాయి.

ఎన్డీయే నుంచి వైదొలగిన అకాలీదళ్ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ బీజేపీపై మండిపడ్డారు. బీహార్ రాష్ట్రానికి మాత్రమే ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తారా అని ఆమె ప్రశ్నించారు. మొత్తం దేశ ప్రజలంతా పన్నులు చెల్లించడం లేదా అని అడిగారు. ఇతర ప్రాంతాల ప్రజలు ఏం పాపం చేశారన్నారు. దేశానికంతటికీ టీకా మందు ఇవ్వాలన్నది ప్రభుత్వ విధిగా ఉండాలన్నారు.

కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర విపక్షాలు కూడా ఇదే బాటలో నిర్మలా వ్యాఖ్యల్ని ఖండించాయి. బీహార్ లో ఎన్నికలున్నాయి కాబట్టి, స్థానికుల్ని ఆకట్టుకోడానికి బీహార్ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని చెప్పిన మంత్రి నిర్మలా సీతారామన్.. సోషల్ మీడియాకి దొరికిపోయారు. ప్రతిపక్షాల విమర్శలకు బలయ్యారు.

243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో గత ఎన్నికల్లో 80 సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీని పక్కనపెట్టి, 71 సీట్లు సాధించిన నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 53సీట్లతో సరిపెట్టుకున్న బీజేపీ.. ఈ దఫా కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవాలనే ఊపులో ఉంది. ఓవైపు జేడీయూతో చెలిమి చేస్తూనే మరోవైపు ఆ పార్టీపై దుమ్మెత్తిపోస్తోన్న ఎల్జేపీతోనూ సయోధ్య నడుపుతోంది. ఈనెల 28నుంచి నవంబర్ 7 వరకు బీహార్ లో ఎన్నికలు జరుగుతాయి.

First Published:  22 Oct 2020 7:37 PM GMT
Next Story