Telugu Global
National

కరోనా కాటునుంచి తప్పించుకున్న బీజేపీ.... బీహార్ ఓపీనియన్ పోల్స్ లో కమలదళానిదే విజయం..

కొవిడ్ విపత్తు తర్వాత భారత్ లో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వంపై ఏమాత్రం ప్రజా వ్యతిరేకత కనపడటం లేదని అంచనా వేస్తున్నాయి ఒపీనియన్ పోల్స్. అక్టోబర్ 28తో మొదలై నవంబర్ 7వరకు మూడు విడతల్లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగిస్తుందని ఏబీపీ-సి ఓటర్ సర్వే తేల్చి చెబుతోంది. 243 స్థానాల బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి ఏకంగా 135నుంచి 159 స్థానాలు కైవసం చేసుకుంటుందని చెబుతోంది ఈ సర్వే. బీజేపీకి […]

కరోనా కాటునుంచి తప్పించుకున్న బీజేపీ.... బీహార్ ఓపీనియన్ పోల్స్ లో కమలదళానిదే విజయం..
X

కొవిడ్ విపత్తు తర్వాత భారత్ లో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వంపై ఏమాత్రం ప్రజా వ్యతిరేకత కనపడటం లేదని అంచనా వేస్తున్నాయి ఒపీనియన్ పోల్స్.

అక్టోబర్ 28తో మొదలై నవంబర్ 7వరకు మూడు విడతల్లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగిస్తుందని ఏబీపీ-సి ఓటర్ సర్వే తేల్చి చెబుతోంది. 243 స్థానాల బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి ఏకంగా 135నుంచి 159 స్థానాలు కైవసం చేసుకుంటుందని చెబుతోంది ఈ సర్వే.

బీజేపీకి గంపగుత్తగా 73నుంచి 81 సీట్లు వస్తాయని ఎన్డీఏ కూటమిలో అదే అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని అంచనాలున్నాయి. 2015లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ ల మహా ఘటబంధన్ అధికారాన్ని చేజిక్కించుకుంది. 80 సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీని పక్కనపెట్టి, 71 సీట్లు సాధించిన జేడీయూ తరపున నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు.

లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకుల్లో ఒకరిని ఉప ముఖ్యమంత్రిని చేసి, మరొకరికి మంత్రివర్గంలో కీలక శాఖలు అప్పగించి సర్దిచెప్పారు. కాంగ్రెస్ కూడా మంత్రి మండలిలో కొలువుతీరింది. అయితే అనతికాలంలోనే ఈ కూటమి విడిపోయింది. అదనుకోసం ఎదురు చూసిన 53 సీట్ల బీజేపీ, జేడీయూతో కలసి అధికారాన్ని పంచుకుంది. అయితే ఎన్నికలనాటికి ఎల్జేపీ ఎన్డీఏనుంచి బైటకొచ్చింది. రామ్ విలాస్ పాశ్వాన్ మరణంతో ఆయన తనయుడు చిరాగ్ పాశ్వాన్, నితీశ్ కుమార్ వ్యవహార శైలి నచ్చక జేడీయూతో తెగతెంపులు చేసుకున్నారు.

అయితే చిరాగ్, బీజేపీతో మాత్రం స్నేహం కోరుకుంటున్నారు. అంటే బీజేపీ కి జేడీయూ, ఎల్జేపీ రెండూ మిత్రపక్షాలే కానీ, వారిలో వారికి మాత్రం పడదు. లాక్ డౌన్ కష్టాలతో ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా మారారన్న వార్తలు ఓవైపు, అధికారపక్షంపై సహజంగానే ఉన్న వ్యతిరేకత మరోవైపు ఉండగా.. ఎన్డీఏ కూటమికి విజయం నల్లేరుపై నడక కాదని కొంతమంది అంచనా వేస్తున్నారు.

ఇక ఆర్జేడీ సభలకు తండోపతండాలుగా వస్తున్న జనం, చిరాగ్ పాశ్వాన్ ఆకట్టుకునే హామీలు, కాంగ్రెస్ పై సింపతీ అన్నీ కలసి ఎన్డీఏ విజయానికి గండి కొడతాయని కూడా అనుకున్నారు. అయితే ఏబీపీ-సి ఓటర్ జరిపిన ఒపీనియన్ పోల్స్ ఊహించని విధంగా ఎన్డీఏ కూటమిదే విజయం అని తేల్చాయి. అందులోనూ బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని కూడా ఈ సర్వే చెబుతోంది.

గతంలో 53సీట్లకు పరిమితం అయిన బీజేపీ ఈ దఫా 73నుంచి 81సీట్లలో గెలుస్తుందని అంచనా వేసింది. ఇదే నిజమైతే బీజేపీపై లాక్ డౌన్ వ్యతిరేక లేనట్టేనని తేలిపోతుంది. బీహారీల మనసు మారలేదని, కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారతాడని అర్థమవుతోంది. బీజేపీ అతిపెద్ద పార్టీగా మారితే దేశంలో రెండో మోడీ పేరు మారుమోగుతుంది. సుశీల్ కుమార్ మోడీ బీహార్ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కడం ఖాయం అనుకోవాల్సిందే.

First Published:  25 Oct 2020 2:48 AM GMT
Next Story