Telugu Global
National

విశాఖకు రాజధాని కళ...

చంద్రబాబు హయాంలో ఏపీకి రాజధానిగా అమరావతి పేరు ప్రకటించాక.. తన అనుకూల మీడియాతో దాన్ని బాగా హైలైట్ చేశారు చంద్రబాబు. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏకంగా అమరావతి పేరుతో జిల్లా ఎడిషన్లు ప్రారంభించాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిత్యం అమరావతి గ్రాఫిక్స్ మీడియాలో కనిపించేలా, ఆ పేరు జనాల నోట్లో నానేలా చేశారు చంద్రబాబు. ఇక సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేసిన తర్వాత కూడా ఈ వ్యవహారంలో మార్పు రాలేదు. పరిపాలనా రాజధానిగా ఎంపికైన విశాఖపై […]

విశాఖకు రాజధాని కళ...
X

చంద్రబాబు హయాంలో ఏపీకి రాజధానిగా అమరావతి పేరు ప్రకటించాక.. తన అనుకూల మీడియాతో దాన్ని బాగా హైలైట్ చేశారు చంద్రబాబు. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏకంగా అమరావతి పేరుతో జిల్లా ఎడిషన్లు ప్రారంభించాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిత్యం అమరావతి గ్రాఫిక్స్ మీడియాలో కనిపించేలా, ఆ పేరు జనాల నోట్లో నానేలా చేశారు చంద్రబాబు.

ఇక సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేసిన తర్వాత కూడా ఈ వ్యవహారంలో మార్పు రాలేదు. పరిపాలనా రాజధానిగా ఎంపికైన విశాఖపై మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏమాత్రం ఫోకస్ పెట్టలేదు. జనాలు కూడా పెద్దగా పట్టించుకోలేదు.

కానీ మెల్లిమెల్లిగా విశాఖకు రాజధాని అనే పేరు వస్తోంది. వైజాగ్ లో జరుగుతున్న వరుస పరిణామాలు.. అనివార్యంగా ఆ పేరుతో చంద్రబాబు అనుకూల మీడియా కూడా బ్యానర్ ఐటమ్స్ రాయాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. సబ్బంహరి ఆక్రమణల తొలగింపు, గీతం యూనివర్సిటీ అక్రమాలపై వేటు.. ఇవన్నీ విశాఖలో రాజకీయ వేడి పుట్టించేశాయి.

ఇటు పాలనా పరంగా కూడా జగన్ సర్కారు దూకుడు పెంచింది. కోర్టులో కేసులు నడుస్తుండటంతో.. పరిపాలనా భవనాల ఎంపిక, వ్యవస్థల తరలింపు కాస్త ఆలస్యమయ్యేట్టు కనిపిస్తున్నాయి. ఇప్పుడు విశాఖ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. విశాఖలో మెట్రో రైల్ కార్యాలయం కూడా ప్రారంభమైంది. విభజన చట్టంలో మెట్రో ప్రాజెక్టు అంశం ఉంది కాబట్టి కేంద్రం కూడా తమకు సహకరిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ.

విశాఖలో మెట్రో కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. కేంద్రం సహకారం ఉన్నా లేకపోయినా విశాఖకు మెట్రో వచ్చి తీరుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వమే మెట్రో బాధ్యతలు తీసుకుంటుందా, లేక ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహిస్తారా అనే విషయాన్ని జగన్ ఫైనల్ చేస్తారని చెప్పారు. విశాఖ మెట్రోకు డీపీఆర్ సిద్ధమవుతోందని.. వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామని స్పష్టం చేశారు. నాలుగు కారిడార్ల విశాఖ మెట్రోలో 75.31 కిలోమీటర్ల రైలు మార్గం నిర్మిస్తామన్నారు. మెట్రో ప్రకటన, కార్యాలయ ఏర్పాటుతో విశాఖకు మరింత కళ వచ్చిందని అంటున్నారు.

గతంలో చంద్రబాబు ప్రభుత్వం 2015 అక్టోబరు 29 న అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. విజయవాడ, విశాఖ పట్నంలో మెట్రో రైలు మార్గం కోసం ఆ సంస్థ ప్రణాళికలు రూపొందించింది. ముందుగా విజయవాడకోసం తయారు చేసిన నివేదిక భారీ ఖర్చుతో కూడుకున్నది కావడంతో కేంద్రం కొర్రీలు వేసి పక్కనపెట్టింది. ఆ తర్వాత చంద్రబాబు కూడా దాన్ని పూర్తిగా పక్కనపడేశారు.

అయితే మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ అనేదే పూర్తిగా కనుమరుగైపోయింది. విశాఖ మెట్రో రైల్ పై ఇప్పుడు వడివడిగా అడుగులు పడుతున్నాయి. జగన్ దూకుడు చూస్తుంటే.. ఈ దఫా తన పాలనలో విశాఖ మెట్రో పరుగులు తీసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు రాజకీయ వేడి, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాల హడావిడితో విశాఖకు రాజధాని కళ వచ్చిందనే విషయం స్పష్టమవుతోంది.

First Published:  26 Oct 2020 1:06 AM GMT
Next Story