Telugu Global
National

ఆటలో అరటిపండులా నితీశ్ కుమార్....

బీహార్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. ఫలితాలపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికే ప్రజలు పట్టంకట్టబోతున్నారని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నా.. కూటమిలో పార్టీల స్థానాలు మారిపోతాయనే విషయం మాత్రం స్పష్టమైంది. జేడీయూ ప్రాభవం తగ్గిపోయి, బీజేపీ పైచేయి సాధిస్తుందని, బీహార్ ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా అవతరిస్తుందని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తరపున బీహార్ కి కాబోయే సీఎం ఎవరు అనే అశం మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్నికల […]

ఆటలో అరటిపండులా నితీశ్ కుమార్....
X

బీహార్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. ఫలితాలపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికే ప్రజలు పట్టంకట్టబోతున్నారని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నా.. కూటమిలో పార్టీల స్థానాలు మారిపోతాయనే విషయం మాత్రం స్పష్టమైంది.

జేడీయూ ప్రాభవం తగ్గిపోయి, బీజేపీ పైచేయి సాధిస్తుందని, బీహార్ ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా అవతరిస్తుందని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తరపున బీహార్ కి కాబోయే సీఎం ఎవరు అనే అశం మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో మా కూటమి అభ్యర్థి మళ్లీ నితీశ్ కుమారే అని అమిత్ షా భరోసా ఇచ్చినా కూడా ఆ రాజకీయ చాణక్యుడి మాటకు రెండువైపులా పదును ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే.

ఫలితాలు ఎలా ఉన్నా నితీశ్ ని తమవైపే ఉంచుకునేందుకు ముందు ఓ మాట వదిలిన అమిత్ షా.. జేడీయూకంటే బీజేపీకి ఎక్కువ స్థానాలు వస్తే.. బీహార్ చరిత్రలో తొలిసారి బీజేపీ నేతను ముఖ్యమంత్రిని చేయకుండా ఉంటారా అనే విషయం అనుమానమే. అందులోనూ 2014, 2019 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున తాను కూడా ప్రధాని బరిలో ఉన్నానంటూ రెచ్చిపోయిన నితీశ్ కుమార్ ని అదను చూసి దెబ్బకొట్టాలని బీజేపీ ఎప్పటినుంచో అనుకుంటూ ఉంది.

2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ నుంచి విడిపోయి కాంగ్రెస్, ఆర్జేడీతో కలసి మహా ఘటబంధన్ గా ఏర్పడి నితీశ్ ఆధ్వర్యంలోని జేడీయూ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకే పొత్తు పొసగక బైటకొచ్చిన నితీశ్ కు బీజేపీ ధృతరాష్ట్ర కౌగిలి అందించింది. అధికారంలో భాగస్వామిగా ఉన్నా కూడా సొంతగా తన ప్రాభవం పెంచుకుంది బీజేపీ, అదే సమయంలో నితీశ్ కుమార్ పైకి శత్రువుల్ని కూడా ఎగదోసింది.

ఇటీవల చనిపోయిన కేంద్ర మాజీ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ ని నితీశ్ పైకి బ్రహ్మాస్త్రంలా ప్రయోగిస్తోంది బీజేపీ. చిరాగ్ పాశ్వాన్ బీజేపీకి నమ్మినబంటు, బీహార్ ఎన్నికల్లో తన పార్టీని సొంతంగా బరిలో నిలిపారు చిరాగ్. విచిత్రం ఏంటంటే.. బీజేపీ పోటీ చేస్తున్న ఏ స్థానంలోనూ ఎల్జేపీ అభ్యర్థులు పోటీలో లేరు. అదే సమయంలో బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లోనూ ఎల్జేపీ గట్టి అభ్యర్థుల్ని రంగంలోకి దించింది. ఇది మిత్ర లాభమా? మిత్ర భేదమా..? అనేది సగటు ఓటరు తలబాదుకున్నా అర్థం కాదు.

వరుసగా మూడు దఫాలు.. 12 ఏళ్లకు పైగా బీహార్ కి ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీశ్ కుమార్ ప్రభ రాను రాను తగ్గిపోతోంది. లోక్ నీతి-సి.ఎస్.డి.ఎస్ సర్వేలో.. బీహార్ లో తిరిగి నితీశ్ ని ముఖ్యమంత్రిగా కావాలనుకుంటున్న వారి శాతం కేవలం 38మాత్రమేనని తేలింది. 43శాతం మంది ప్రజలు నితీశ్ కి తిరిగి అధికారం దక్కకూడదని కోరుకుంటున్నారట.

2000 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా తొలిసారి ఎన్నికైన నితీశ్ కుమార్.. అనివార్య కారణాల వల్ల వెంటనే రాజీనామా చేశారు. ఆ తర్వాత తిరిగి 2005లో ముఖ్యమంత్రిగా గెలిచి మహిళా విద్యకు అధిక ప్రాధాన్యమివ్వడంతోపాటు, పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో బీహార్ ప్రజల హృదయాలు గెలుచుకున్నారు. అప్పట్లో ఆయనకు 77శాతం మంది ప్రజల మద్దతు ఉండేది. 2010 ఎన్నికలనాటికి అది 80శాతానికి పెరిగింది.

అయితే 2015కల్లా రాష్ట్రంలో రాజకీయంగా పెను మార్పులు సంభవించాయి. విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్, ఆర్జేడీతో కలసి మహా ఘటబంధన్ గా పోటీ చేసి, అవకాశ వాద రాజకీయాలతో చివరికి వారికి హ్యాండ్ ఇచ్చి బీజేపీతో జట్టు కట్టారు నితీశ్. ఆ అవకాశవాదమే ఇప్పుడు ఆయన కొంప ముంచేలా కనిపిస్తోంది.

లాలూ తనయులు కొత్త తరం రాజకీయమంటూ.. ఉద్యోగం, ఉపాధి కల్పన ప్రధాన అస్త్రాలుగా చేసుకున్నారు. నితీశ్ మోసకారి అంటూ చిరాగ్ పాశ్వాన్ రాష్ట్రమంతా దళిత ఓటర్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ కొత్తగా చేసిందేమీ లేకపోయినా ఆ పార్టీపై అక్కడి ప్రజల్లో కాస్తో కూస్తో సింపతీ ఉంది.

ఇవన్నీ ఒకెత్తు అయితే.. బీజేపీ సొంతంగా బలం పెంచుకోవడం మరొక ఎత్తు. వీటన్నిటినీ నితీశ్ తట్టుకోవడం కష్టసాధ్యమని తెలుస్తోంది. బీజేపీ మద్దతుతో నితీశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఐదేళ్లు వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలి. ఫలితాలు తేడగా వచ్చి.. బీజేపీకి అత్యథిక స్థానాలు వస్తే మాత్రం నితీశ్ ని కూరలో కరివేపాకులా ఏరిపడేయడం ఖాయం. అప్పుడు నితీశ్ కాకపోతే బీజేపీకి చాలా ప్రత్యామ్నాయాలు ఉంటాయి. పొత్తు నియమాల్ని ఉల్లంఘించారని గొడవ చేసే అర్హత కూడా నితీశ్ కి లేదు కాబట్టి.. ఆయన సైలెంట్ గా ఉండక తప్పదు.

మొత్తమ్మీద బీహార్ రాజకీయాల్లో ఈ దఫా నితీశ్ నెగ్గుకు రావడం అనుమానమేనని తెలుస్తోంది.

First Published:  26 Oct 2020 8:39 PM GMT
Next Story