Telugu Global
National

నిమ్మగడ్డ సమావేశానికి మేం దూరం " వైసీపీ

స్థానిక ఎన్నికలను జరపాలా, వద్దా అనే విషయంపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల అభిప్రాయ సేకరణ సమావేశానికి వైసీపీ హాజరు కావడం లేదని స్పష్టం చేశారు ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. రాష్ట్రంలో కేవలం 3 కరోనా కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు వాయిదా వేసిన ఈసీ, ఇప్పుడు సగటున రోజుకి 3వేల కేసులు నమోదవుతున్న సందర్భంలో ఎన్నికల కోసం ఎందుకు తొందర పడుతున్నారంటూ ప్రశ్నించారు. వాయిదా వేసేటప్పుడు […]

నిమ్మగడ్డ సమావేశానికి మేం దూరం  వైసీపీ
X

స్థానిక ఎన్నికలను జరపాలా, వద్దా అనే విషయంపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల అభిప్రాయ సేకరణ సమావేశానికి వైసీపీ హాజరు కావడం లేదని స్పష్టం చేశారు ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు.

రాష్ట్రంలో కేవలం 3 కరోనా కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు వాయిదా వేసిన ఈసీ, ఇప్పుడు సగటున రోజుకి 3వేల కేసులు నమోదవుతున్న సందర్భంలో ఎన్నికల కోసం ఎందుకు తొందర పడుతున్నారంటూ ప్రశ్నించారు. వాయిదా వేసేటప్పుడు కనీసం ప్రభుత్వానికి కూడా సమాచారం ఇవ్వకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్న ఆయనకు.. ఇప్పుడు అఖిలపక్ష ఆమోదంతో ఏం అవసరమొచ్చిందని అన్నారు.

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా కాకుండా స్టార్‌ హోటళ్లలో చీకటి సమావేశాలు జరిపే వ్యక్తిగా మాత్రమే రాష్ట్ర ప్రజలకు గుర్తున్నారని విమర్శించారు అంబటి. ఎన్నికల నిర్వహణను ఒక పవిత్ర మైన రాజ్యాంగ కర్తవ్యంగా కాకుండా ఒక డ్రామాగా నిమ్మగడ్డ భావిస్తున్నారని అన్నారు.

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ఆగిపోయిందని, తిరిగి ఆ ప్రక్రియ ప్రారంభించాలంటే రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలు తీసుకోవాలని సాక్షాత్తూ సుప్రీంకోర్టు ఆదేశించినా నిమ్మగడ్డ వాటిని పరిగణలోకి తీసుకోకపోవడం సరికాదని చెప్పారు. ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను.. చీఫ్‌ సెక్రటరీని గాని, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సెక్రటరీని గాని అడిగి తెలుసుకోకుండానే, రాజకీయ పార్టీలను పిలవడంలో ఆయన ఉద్దేశం ఏంటో స్పష్టమవుతోందని అన్నారు.

రాజకీయ పార్టీలతో ఒన్‌ టు ఒన్‌ సమావేశం అంటూ పిలవడం కచ్చితంగా నిమ్మగడ్డ–చంద్రబాబు రాజకీయంలో భాగమేనని అన్నారు అంబటి. రాష్ట్రంలో ఉనికి లేని, పోటీ చేయని, ఒక్క ఓటు కూడా లేని పార్టీలను ఈ సమావేశానికి నిమ్మగడ్డ పిలిచారంటే దాని మర్మం ఏంటో మరికొన్ని గంటల్లోనే ప్రజలకు తెలుస్తుందని అన్నారు.

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా స్థానిక సంస్థల్లో వందశాతం విజయావకాశాలు వైసీపీవేనని స్పష్టం చేశారు అంబటి. అదే సమయంలో ఓటరు భద్రతకు వైసీపీ కట్టుబడి ఉందని, ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బంది భద్రత కూడా తమకు ముఖ్యమేనని అన్నారు. కరోనా కాలంలో మొండిగా ఎన్నికలకు వెళ్తే ఓటర్లకు, సిబ్బందికి ఏమైనా జరిగితే నిమ్మగడ్డ బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు.

వైసీపీపై ఆరోపణలు చేసే క్రమంలో తనకు ప్రాణభయం ఉందని, వైసీపీది ఫ్యాక్షనిస్ట్‌ ధోరణి అని, సంఘవ్యతిరేక శక్తులు అంటూ లేఖలు రాసిన చరిత్ర నిమ్మగడ్డ రమేశ్‌ది అని గుర్తు చేశారు. అధికార పార్టీపై తీవ్రమైన అంసతృప్తి, అసహనం, ద్వేషం, వ్యతిరేక అజెండా ఉన్న వ్యక్తి ఒక్కో పార్టీకి 10 నిమిషాలు అనే అజెండాతో పెట్టిన సమావేశాన్ని తాము తిరస్కరిస్తున్నామని, సుప్రీంకోర్టు తీర్పుకి భిన్నంగా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ముందుకు వెళ్తున్న ఆయన ధోరణిని తమ పార్టీ ఖండిస్తోందని చెప్పారు అంబటి రాంబాబు.

First Published:  27 Oct 2020 9:07 PM GMT
Next Story