ఎన్నికలకోసమే పోల’రణం’…

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో బీజేపీ ఈ వ్యవహారాన్ని ఆసక్తిగా గమనిస్తోంది.

జాతీయ ప్రాజెక్ట్ గా పోలవరాన్ని నిర్మించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నా కూడా.. కమీషన్లకోసం గత టీడీపీ ప్రభుత్వం దాన్ని తమ చేతుల్లోకి తెచ్చుకుందనే ఆరోపణలున్నాయి. పోలవరం విషయంలో చంద్రబాబు సాధించిన ఘన విజయం ఏంటంటే.. ముంపు గ్రామాలను తెలంగాణ నుంచి ఏపీలో విలీనం చేయడం. అది మినహా.. చంద్రబాబు పనితీరు వల్ల పోలవరానికి ఒరిగిన ప్రయోజనం ఒక్కటికూడా లేదంటారు వైసీపీ నేతలు.

కాంట్రాక్టర్లు, అధికారులు చేసే పనిని కూడా తన ప్రతిభగా చెప్పుకునే అలవాటున్న చంద్రబాబు.. కాఫర్ డ్యాం కట్టాం, కాంక్రీట్ పనుల్లో గిన్నిస్ రికార్డ్ సృష్టించాం అంటూ గొప్పలు చెప్పుకున్నారు. అన్ని రికార్డులు బ్రేక్ చేస్తే.. ఐదేళ్ల టీడీపీ హయాంలో పోలవరం ఎందుకు పూర్తి కాలేదన్నది అసలు ప్రశ్న.

పోనీ టీడీపీ నేతలు చెబుతున్నట్టే 70శాతం పనులు పూర్తయ్యాయి అనుకుందాం. మరి కేవలం 30 శాతం పనులకోసం ఎందుకీ గొడవలన్నీ. పోలవరం బడ్జెట్ లో దాదాపు 50శాతం తెగ్గోయడానికి కేంద్రం సిద్ధపడినట్టు ఆరోపణలు చేస్తున్న టీడీపీకి.. నిధుల్లో 50శాతం కోతకోస్తే.. తమ హయాంలో 70 శాతం పనులు ఎలా పూర్తయ్యాయో చెప్పాల్సిన బాధ్యత లేదా? 2019 ఎన్నికలనాటికి పోలవరాన్ని ఎన్నికల అజెండాగా మార్చుకోవడంలో టీడీపీ విజయవంతం అయింది. 2024 ఎన్నికలనాటికి దీన్ని మరోసారి మేనిఫెస్టో అంశంగా చేర్చుకోడానికి బీజేపీ సిద్ధమవుతోంది. అందుకే నిధుల విషయంలో కొర్రీలు వేస్తూ.. పోలవరం వ్యవహారాన్ని సాగదీస్తోంది.

ఎలాగూ జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి.. జగన్ సొంతంగా దీన్ని భుజానికెత్తుకునే సాహసం చేయలేరు. అందుకే టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం పెట్టి బీజేపీ తమాషా చూస్తోంది. పోలవరాన్ని ఎన్నికల దాకా సాగదీస్తే.. టీడీపీ, వైసీపీ వైఫల్యంగా దీన్ని ప్రొజెక్ట్ చేస్తూ వచ్చే ఎన్నికలకు ఈ అంశాన్ని ప్రధాన అస్త్రంగా మార్చుకోవాలని చూస్తోంది బీజేపీ.

ఏపీలో పాగా వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్న కమలదళం.. 2024నాటికి టీడీపీ, జనసేనతో కలిసి పనిచేసినా.. లేక సొంతంగా బరిలో దిగినా.. తమ అజెండాను మాత్రం పక్కాగా ఖరారు చేసుకుంటోంది బీజేపీ. స్థానిక నాయకత్వాన్ని విజయవంతంగా ముంచేస్తూ బీహార్ లో తన వ్యూహాన్ని అమలు చేసినట్టే.. ఏపీలో కూడా అధికారంలో భాగస్వామి కావడానికి ఇప్పటినుంచే అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. అందులో పోలవరాన్ని బ్రహ్మాస్త్రంగా వాడాలనుకుంటోంది.