ఓపెనింగ్ కు వచ్చింది… తర్వాత మిస్సయింది

లాక్ డౌన్ కు ముందు సంగతి. సాయితేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో భగవాన్-పుల్లారావు నిర్మాతలుగా కొత్త సినిమా లాంఛ్ అయింది. ఈ ఓపెనింగ్ కు పవన్ కల్యాణ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. హీరో సాయితేజ్, హీరోయిన్ నివేత పెతురాజ్ పై క్లాప్ కొట్టాడు. తర్వాత లాక్ డౌన్ పడింది.

కట్ చేస్తే, లాక్ డౌన్ ముగిసేసరికి హీరోయిన్ మారిపోయింది. ఓపెనింగ్ కు కూడా వచ్చిన నివేత పెతురాజ్ ను సైడ్ చేశారు. ఆమె స్థానంలో ఐశ్వర్యరాజేష్ ను తీసుకున్నారు. ఈ వ్యవహారం అంతా ఎంత గుట్టుచప్పుడు కాకుండా జరిగిందంటే… సాయితేజ్-ఐశ్వర్యరాజేష్ తో షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు.

సినిమాల్లో హీరోయిన్లు రీప్లేస్ అవ్వడం కామన్. ముందు ఒకర్ని అనుకొని తర్వాత వేరే హీరోయిన్ ను తీసుకోవడం సర్వసాధారణం. కానీ ఓపెనింగ్ కు కూడా వచ్చిన తర్వాత హీరోయిన్ ను మార్చేయడం, తర్వాత కూడా ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈమధ్య 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చిన హీరో కూడా ఈ విషయాన్ని బయటపెట్టకపోవడం విడ్డూరం. ఇంతకీ ఏం జరిగిందనే విషయాన్ని నివేత పెతురాజ్ చెబితేనే బాగుంటుందేమో.