Telugu Global
National

విద్యార్థుల హాజరుపై ప్రభుత్వం కీలక నిర్ణయం...

కరోనా కేసులు పెరుగుతున్నా కూడా అనాలోచితంగా స్కూళ్లను పునఃప్రారంభించారంటూ ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కు పెడుతున్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల హాజరు తప్పనిసరి కాదని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇదివరకే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ నిర్ణయాన్ని ప్రకటించినా.. ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. కరోనా సమయంలో విద్యార్థులను బలవంతంగా ప్రభుత్వ పాఠశాలలకు రప్పించడం లేదని.. తల్లిదండ్రుల ఇష్టప్రకారమే హాజరవుతున్నారని చెప్పారు అవంతి. […]

విద్యార్థుల హాజరుపై ప్రభుత్వం కీలక నిర్ణయం...
X

కరోనా కేసులు పెరుగుతున్నా కూడా అనాలోచితంగా స్కూళ్లను పునఃప్రారంభించారంటూ ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కు పెడుతున్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది.

విద్యార్థుల హాజరు తప్పనిసరి కాదని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇదివరకే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ నిర్ణయాన్ని ప్రకటించినా.. ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. కరోనా సమయంలో విద్యార్థులను బలవంతంగా ప్రభుత్వ పాఠశాలలకు రప్పించడం లేదని.. తల్లిదండ్రుల ఇష్టప్రకారమే హాజరవుతున్నారని చెప్పారు అవంతి. ఆన్‌లైన్‌ తరగతులు వినేందుకు అవసరమైన స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్‌ సౌకర్యం లేని పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు ప్రారంభించామని మంత్రి చెప్పారు.

హాజరు విషయంలో ఇదివరకే ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించినా కొన్ని అపోహలు మాత్రం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో మిగిలే ఉన్నాయి. ప్రతిపక్షాల రాద్ధాంతం, వారి అనుకూల మీడియా చిలువలు పలువలు చేసి రాస్తున్న వార్తలతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన క్రమక్రమంగా పెరుగుతోంది. అయితే వాస్తవాలు పరిశీలిస్తే స్కూళ్లు తెరిచే ముందు కొవిడ్ పరీక్షలు చేసిన సమయంలో మాత్రమే 829మంది ఉపాధ్యాయులు, 575 మంది విద్యార్థులు కరోనా బారిన పడినట్టు ఇటీవల పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఆ తర్వాత పాఠశాలల్లో ఎక్కడా కొవిడ్ వ్యాప్తి చెందినట్టు సమాచారం లేదు. కొత్తగా విద్యార్థులెవరూ కరోనాబారిన పడిన దాఖలాలు లేవు. అందులోనూ కొవిడ్ బారిన పడిన విద్యార్థులు, ఉపాధ్యాయుల శాతం 1కంటే తక్కువగానే ఉంది. దీంతో పాఠశాలలపై ప్రభుత్వం వెనకడుగేయలేదు. స్థానిక ఎన్నికలను పాఠశాలలతో లింకు పెడుతూ విమర్శిస్తున్నా కూడా స్థిర నిర్ణయంతోనే ఉంది.

అయితే తాజాగా హాజరు విషయంలో మాత్రం మినహాయింపు ఉంటుందని మంత్రులు తేల్చి చెబుతున్నారు. తరగతులకు నేరుగా హాజరు కాలేకపోయినా పరీక్షలు రాసే వెసులుబాటు కల్పిస్తామని నేతలు, అధికారులు స్పష్టం చేస్తున్నారు. కేవలం 150 పనిదినాలకే ఈ విద్యా సంవత్సరాన్ని కుదించి, సిలబస్ కూడా వీలైనంతగా తగ్గించారు. పరీక్షల కాఠిన్యత స్థాయి కూడా తగ్గించి ఉదారంగా వ్యవహరించే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో పిల్లల భవిష్యత్ పై తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని, ఏమాత్రం అనుమానం ఉన్నా స్కూళ్లకు పంపించవద్దని ప్రభుత్వం సూచిస్తోంది. హాజరు తప్పనిసరి కాదని మరోసారి స్పష్టం చేసింది.

First Published:  8 Nov 2020 7:16 AM GMT
Next Story