Telugu Global
International

బీజేపీ జమిలి జపం అందుకే...

లోక్ సభ ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తున్నా… ఆ తర్వాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దారుణ పరాభవాలను మూటగట్టుకుంటోంది. అందుకే లోక్ సభతోపాటే, అసెంబ్లీల ఎన్నికలను కూడా కలిపి నిర్వహిస్తే జమిలితో తమకి లాభం వస్తుందని బీజేపీ ఆశ. ఆమేరకు రాష్ట్రాలను ఇప్పటినుంచే సన్నద్ధం చేయాలని కూడా చూస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. 2022 చివరినాటికి అప్పటికి సిద్ధంగా ఉన్న రాష్ట్రాలతోపాటు.. మిగతా రాష్ట్రాల అసెంబ్లీలను, లోక్ సభను కూడా రద్దు చేసి జమిలి ఎన్నికలకు […]

బీజేపీ జమిలి జపం అందుకే...
X

లోక్ సభ ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తున్నా… ఆ తర్వాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దారుణ పరాభవాలను మూటగట్టుకుంటోంది. అందుకే లోక్ సభతోపాటే, అసెంబ్లీల ఎన్నికలను కూడా కలిపి నిర్వహిస్తే జమిలితో తమకి లాభం వస్తుందని బీజేపీ ఆశ. ఆమేరకు రాష్ట్రాలను ఇప్పటినుంచే సన్నద్ధం చేయాలని కూడా చూస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. 2022 చివరినాటికి అప్పటికి సిద్ధంగా ఉన్న రాష్ట్రాలతోపాటు.. మిగతా రాష్ట్రాల అసెంబ్లీలను, లోక్ సభను కూడా రద్దు చేసి జమిలి ఎన్నికలకు వెళ్లాలనేది బీజేపీ ఆలోచన.

బీహార్ ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీకి జమిలి ఎన్నికల అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లో క్లీన్ స్వీప్ చేసింది ఎన్డీఏ. 40 లోక్ సభ స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి(బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ) 39 గెలుచుకుంది. కట్ చేస్తే 2020లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో సగానికి సగం సీట్లలో కోత పడుతుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

243 స్థానాల అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 100లోపే ఆగిపోతుందని సర్వేల సారాంశం. 40లో 39 లోక్ సభ సీట్లు గెల్చుకున్న ఎన్డీఏ కూటమికి 243లో కనీసం 220 స్థానాలు రావాలి. మరి జరుగుతుందేంటి. అదే బీహార్ లో అప్పుడో ఇప్పుడో జమిలి ఎన్నికలు జరిగి ఉంటే.. సగటున లోక్ సభ, అసెంబ్లీ సీట్ల విషయంలో కూడా ఎన్డీఏదే పైచేయిగా ఉండేదనేది బీజేపీ ఆలోచన. బీహార్ లో బీజేపీ బొక్కబోర్లా పడుతుందన్న సందర్భంలో మరోసారి జమిలి అంశం తెరపైకి వస్తోంది.

1952, 1957, 1962, 1967లలో లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో కాంగ్రెస్ తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. రాష్ట్రాల్లో చిన్నా చితకా ప్రతిపక్షాలు కాంగ్రెస్ ని ఎదుర్కోలేకపోయాయి. ఇప్పుడు కూడా బీజేపీ అదే పరిస్థితి కావాలంటోంది. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ.. జమిలి స్మరణ చేస్తూనే ఉంది.

2017లో నీతి ఆయోగ్‌ జమిలి ఎన్నికలపై ఓ నివేదిక రూపొందించింది. 2018లో లా కమిషన్ ఈ నివేదికకు ఆమోద ముద్రవేసింది. అయితే దీనికోసం పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ పదవీకాలం పొడిగించడమో, తగ్గించడమో చేయాల్సి ఉంటుందని, ఇందుకు కనీసం అయిదు రాజ్యాంగ సవరణలను చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

ఈ సవరణలను రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో అధికారం లేదా అధికార భాగస్వామ్యంలో ఉన్న బీజేపీ.. ఇతర రాష్ట్రాల్లో కనీసం నాలుగైనా తమకు మద్దతు తెలుపుతాయని ఆశిస్తోంది. దేశవ్యాప్తంగా 22 పార్టీలు జమిలికి అనుకూలంగా ఉన్నట్టు సమాచారం. ఆయా పార్టీల లోక్‌సభా బలాన్ని బట్టి చూస్తే దాదాపు 440 మందికి పైగా ఎంపీలు జమిలి ఎన్నికలకు మద్దతు పలికారని చెప్పాలి.

రాజ్యసభలో 2021 నాటికి బీజేపీ మెజారిటీ సాధిస్తుందని, ప్రాంతీయ పార్టీల నుంచి వలసలు జరిగితే వచ్చే సంవత్సరమే ఎన్డీఏ మెజారిటీ సాధించి జమిలి ఎన్నికలపై రాజ్యాంగ సవరణకు వీలు కలుగుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బీహార్ లాంటి ఎదురు దెబ్బలతో బీజేపీకి తల మరింతగా బొప్పి కడుతోంది.

ఎన్నో ఆశలు పెట్టుకున్న రాష్ట్రాల్లో కూడా అదృష్టం ఇలా తిరగబడితే.. పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఇంకెలాంటి ఘోర పరాభవాలు జరుగుతాయో అమిత్ షా, మోదీ ద్వయానికి బాగా తెలుసు. అందుకే వీలైనంత త్వరగా జమిలి ఆయుధానికి పదును పెట్టాలని చూస్తోంది బీజేపీ.

First Published:  8 Nov 2020 8:55 AM GMT
Next Story