Telugu Global
International

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్

అగ్రరాజ్యం జో బైడెన్ నాయకత్వానికే మొగ్గు చూపింది. అత్యంత ఉత్కంఠగా జరిగిన ఎన్నికల్లో అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యారు. మరోవైపు భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అమెరికా చరిత్రంలో ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్న మొట్టమొదటి మహిళగా, శ్వేతజాతీయేతర వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించారు. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 538 ఓట్లు ఉండగా.. డెమోక్రటిక్ పార్టీకి చెందిన జో బైడెన్‌కు 290 ఓట్లు, రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్‌కు 214 […]

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్
X

అగ్రరాజ్యం జో బైడెన్ నాయకత్వానికే మొగ్గు చూపింది. అత్యంత ఉత్కంఠగా జరిగిన ఎన్నికల్లో అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యారు. మరోవైపు భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అమెరికా చరిత్రంలో ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్న మొట్టమొదటి మహిళగా, శ్వేతజాతీయేతర వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించారు.

ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 538 ఓట్లు ఉండగా.. డెమోక్రటిక్ పార్టీకి చెందిన జో బైడెన్‌కు 290 ఓట్లు, రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్‌కు 214 ఓట్లు లభించాయి. 270 మ్యాజిక్ ఫిగర్ దాటడంతో బైడెన్‌ను విజయం వరించింది.

సర్వేల్లో చెప్పిన విధంగానే బైడెన్ వైపే అమెరికా ప్రజలు మొగ్గు చూపారు. కీలకమైన కాలిఫోర్నియా(55), న్యూయార్క్ (29), ఇలినాయి (20) వంటి రాష్ట్రాల్లో గెలవడం బైడెన్‌కు కలసి వచ్చింది. గతంలో రిపబ్లికన్లకు మద్దతు పలికిన పెన్సిల్వేనియా (20), మిషిగన్ (16), అరిజోనా (11), విస్కాన్సిన్ (10) రాష్ట్రాలు ఇప్పుడు డెమోక్రాట్ల వైపు తిరిగారు. దీంతో బైడెన్ గెలుపు సులవైంది. వరుసగా రెండో సారి అధ్యక్ష పదవిని కాపాడుకోలేక పోయిన 10వ వ్యక్తిగా ట్రంప్ నిలిచారు. 1992లో సీనియర్ బుష్.. రెండో సారి క్లింటన్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత అలా ఓటమి పాలయ్యింది ట్రంపే.

ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం బైడెన్ మాట్లాడుతూ.. మన దేశాన్ని ముందుండి నడిపించే స్థానానికి నన్ను ఎన్నుకున్నందుకు సంతోషంగా ఉన్నది. ఇది మీరు నాకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాను. నాపై మీరు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. ఎన్నికలు అమెరికా అంతరాత్మకు సంబంధించినవని కమలా హారీస్ వ్యాఖ్యానించారు. మన ముందు ఇంకా చాలా పని ఉంది. ఇక మొదలుపెడదాం అని ఆమె అన్నారు.

మరోవైపు తాను ఈ ఓటమిని అంగీకరించనని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. నిజాయితీగా ఓట్లను లెక్కపెట్టే వరకు విశ్రమించనని.. అమెరికా అధ్యక్షుడు ఎవరన్నది లీగల్ ఓట్లు నిర్ణయిస్తాయని ఆయన చెప్పారు. కాగా, వచ్చే ఏడాది జనవరి 20న బైడెన్, కమలాహారిస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

First Published:  7 Nov 2020 9:46 PM GMT
Next Story