Telugu Global
National

లోకేష్ కి పక్కలో బల్లెంలా రామ్మోహన్ నాయుడు...

టీడీపీలో నాయకత్వ శూన్యం ఉందనేది నిర్వివాదాంశం. చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో పార్టీని ఒకేతాటిపై నడిపే సత్తా లోకేష్ కు ఉందనడం అతిశయోక్తే అవుతుంది. ఈ విషయం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా తెలుసు. అయితే అధినాయకత్వం ప్రాపకం కోసం చినబాబుని అంటిపెట్టుకునే ఉంటున్నారు సీనియర్ నాయకులు. ఇక యువనాయకత్వం విషయానికొస్తే.. ఎవరికి వారే తమ సొంత ఇమేజ్ కోసం సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియా అండతో పాపులార్టీ తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో ఎంపీ కింజరపు […]

లోకేష్ కి పక్కలో బల్లెంలా రామ్మోహన్ నాయుడు...
X

టీడీపీలో నాయకత్వ శూన్యం ఉందనేది నిర్వివాదాంశం. చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో పార్టీని ఒకేతాటిపై నడిపే సత్తా లోకేష్ కు ఉందనడం అతిశయోక్తే అవుతుంది. ఈ విషయం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా తెలుసు. అయితే అధినాయకత్వం ప్రాపకం కోసం చినబాబుని అంటిపెట్టుకునే ఉంటున్నారు సీనియర్ నాయకులు.

ఇక యువనాయకత్వం విషయానికొస్తే.. ఎవరికి వారే తమ సొంత ఇమేజ్ కోసం సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియా అండతో పాపులార్టీ తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ముందు వరుసలో ఉంటారు. గతంలో రామ్మోహన్ నాయుడిని ఏపీ టీడీపీ అధ్యక్షుడిని చేయాలంటూ ఉత్తరాంధ్ర వేదికగా ఓ ఉద్యమమే మొదలైంది. సోషల్ మీడియాలో ఈ పోస్టింగ్ లు తట్టుకోలేక లోకేష్ చిర్రుబుర్రులాడారు కూడా. ఆ తర్వాత వ్యూహాత్మకంగా రామ్మోహన్ నాయుడితోనే తనకా ఉద్దేశం లేదని చెప్పించారు. ఉత్తరాంధ్ర గళాన్ని తొక్కిపట్టారు.

తీరా ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో ఏపీ టీడీపీ పగ్గాలు అచ్చెన్నాయుడి చేతిలో పెట్టాల్సి వచ్చింది. అచ్చెన్న రాకతో పార్టీలో కాస్తో కూస్తో కదలిక వచ్చిందనేమాట వాస్తవం. టిడ్కో ఇళ్ల వ్యవహాంలో అయినా, మరో విషయంలో అయినా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి కౌంటర్లు ఇస్తూ.. కొత్తగా ఎంపిక చేసిన పార్లమెంటరీ నియోజకవర్గాల టీడీపీ అధ్యక్షుల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు అచ్చెన్నాయుడు. అదే సమయంలో రామ్మోహన్ నాయుడు కూడా మరోసారి తన వ్యూహాలకు పదును పెట్టారు.

సోషల్ మీడియా వేదికగా ఉత్తరాంధ్ర నేపథ్యంలో జిల్లాల విభజన వద్దంటూ కొత్త ఉద్యమం మొదలు పెట్టారు. శ్రీకాకుళం జిల్లాను విభజించొద్దంటూ, అలా విభజిస్తే వచ్చే నష్టాలను వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు రామ్మోహన్ నాయుడు. ఈ యువఎంపీకి మద్దతుగా మరికొంతమంది తమ గళం వినిపిస్తున్నారు. దీన్ని రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మార్చాలని, రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై రాజకీయ ఆందోళనకు శ్రీకారం చుట్టాలని, దానికి తాను నాయకత్వం వహించాలనేది రామ్మోహన్ నాయుడి ఆలోచన.

మొత్తమ్మీద స్తబ్దుగా ఉన్న టీడీపీ రాజకీయాల్లో అటు బాబాయ్, ఇటు అబ్బాయ్ ఓ కదలిక తేవడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అచ్చెన్న యాక్టివ్ అయినా తట్టుకోవచ్చు కానీ, రామ్మోహన్ నాయుడు దూసుకొస్తే.. లోకేష్ విషయంలో ఇబ్బంది ఎదురవుతుందనేది చంద్రబాబు ఆలోచన. మంత్రి పదవిలో ఉండి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన చరిత్ర లోకేష్ ది. వైసీపీ తాకిడికి తట్టుకుని మరీ ఎంపీ సీటు కైవసం చేసుకున్న నేర్పరితనం రామ్మోహన్ నాయుడిది. కార్యకర్తలయినా, నాయకులైనా ఇద్దరి మధ్య పోలిక పెడితే.. రామ్మోహన్ నాయుడిదే పైచేయి అని చెప్పాలి.

అందుకే ఆ ప్రమాదం మరింత పెద్దది కాకముందే దాన్ని చక్కబెట్టాలని చూస్తున్నారట చంద్రబాబు. లోకేష్ కి పక్కలో బల్లెంలా మారుతున్న రామ్మోహన్ నాయుడి ప్రాభవాన్ని తగ్గించేందుకు తనదైన పరిష్కార మార్గం వెదుకుతున్నారు.

First Published:  8 Nov 2020 11:44 PM GMT
Next Story