Telugu Global
National

తిరుపతి ఉప ఎన్నిక.... బీజేపీ-టీడీపీ బంధానికి ఊపిరిపోస్తుందా?

తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందని సోము వీర్రాజు ప్రకటించారు. ఆయన ప్రకటనను కొందరు బీజేపీది అతివిశ్వాసం అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక తరువాత ఏదేదో ఊహించుకుంటూ తిరుపతి స్థానాన్ని కూడా గెలుస్తామని భ్రమ పడుతున్నారు అని కొందరు విమర్శిస్తున్నారు. కానీ సోము వీర్రాజుది అతి విశ్వాసం కానేకాదు. పగటి కల కూడా కాదు. వాస్తవం. తిరుపతి ఉప ఎన్నిక జరిగితే బీజేపీ గట్టిపోటీ ఇవ్వడం ఖాయం. దానికి కారణం అక్కడ […]

తిరుపతి ఉప ఎన్నిక.... బీజేపీ-టీడీపీ బంధానికి ఊపిరిపోస్తుందా?
X

తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందని సోము వీర్రాజు ప్రకటించారు. ఆయన ప్రకటనను కొందరు బీజేపీది అతివిశ్వాసం అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక తరువాత ఏదేదో ఊహించుకుంటూ తిరుపతి స్థానాన్ని కూడా గెలుస్తామని భ్రమ పడుతున్నారు అని కొందరు విమర్శిస్తున్నారు.

కానీ సోము వీర్రాజుది అతి విశ్వాసం కానేకాదు. పగటి కల కూడా కాదు. వాస్తవం. తిరుపతి ఉప ఎన్నిక జరిగితే బీజేపీ గట్టిపోటీ ఇవ్వడం ఖాయం. దానికి కారణం అక్కడ బీజేపీ బలం కాదు. బీజేపీకి… టీడీపీ, కాంగ్రెస్‌, సీపీఐ ఇంకా అవసరమైతే బీఎస్పీ తదితర పార్టీలు బీజేపీ గెలుపుకు తీవ్రంగా కృషిచేసే అవకాశం ఉంది.

ఎట్లాగూ జనసేనకు బీజేపీతో ఒప్పందం ఉంది కాబట్టి జనసేన ఎలాగూ బీజేపీ గెలుపుకు కృషిచేస్తుంది.

వర్షం వచ్చే ముందు కొన్ని సూచనలు కనిపించినట్లుగానే టీడీపీ భవిష్యత్తులో చేయబోయే పని గురించి ఎల్లో మీడియాలో ముందుగానే సూచనలు తెలుస్తాయి. తిరుపతి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో ఖచ్చితంగా తెలియకపోయినా బీజేపీని చాలా బలమైన అభ్యర్థిగా ఎల్లోమీడియా ఫోకస్‌ చేయడం రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలను సూచిస్తుంది.

దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలిచాక త్వరలో జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇవ్వడానికి టీడీపీ తహతహలాడుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ అడగకపోయినా టీడీపీ పరోక్షంగా మద్ధతు ఇవ్వడానికి సిద్ధమైంది. అలాగే బీజేపీ తరపున బలమైన అభ్యర్ధిని నిలబెట్టడానికి… గెలిచే బీజేపీ అభ్యర్ధికోసం టీడీపీ దుర్భిణీ వేసి వెతుకుతోంది. టీడీపీ పోటీచేయకుండా బీజేపీ గెలుపుకు తన సర్వశక్తులూ ఒడ్డి కృషి చేస్తుంది. అలాగే వైసీపీ ఓట్లు చీల్చేవిధంగా కాంగ్రెస్‌ తరపున అభ్యర్ధిని నెలబెట్టడానికి చంద్రబాబు ప్లాన్ చేసి తీరుతాడు. ఇక సీపీఐ సంగతి చెప్పేదేముంది… చంద్రబాబు జేబులో పార్టీ.

తిరుపతి ఎంపీ స్థానం ఎస్సి రిజర్వుడ్‌ కాబట్టి… ఎక్కువమంది దళితులు బీజేపీకి వ్యతిరేకం కాబట్టి… దళితుల ఓట్లు చీల్చడానికి బీఎస్పీని చంద్రబాబు రంగంలోకి దించినా దించవచ్చు.

ఇలా అన్నివిధాలా సహకరించి బీజేపీ అభ్యర్ధిని గెలిపించగలిగితే ఇదే మన సక్సెస్‌ ఫార్ములా…. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ, టీడీపీ కలిసి పోటిచేస్తే ఏపీలో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవచ్చు అనే నమ్మకాన్ని కలిగిస్తాడు చంద్రబాబు.

చంద్రబాబుకు ఇప్పుడు కావాల్సింది ముఖ్యమంత్రి పీఠం కూడా కాదు…. కేసులనుంచి బయటపడాలి… బీజేపీ సహకారం కావాలి. అందుకోసం ముఖ్యమంత్రి పదవినైనా బీజేపీకి త్యాగం చేసేందుకు ఆయన సిద్ధపడవచ్చు.

ముఖ్యమంత్రి పీఠాన్నే కాదు, అవసరమైతే టీడీపీలో కొందరు ముఖ్యులను కూడా బీజేపీలోకి పంపవచ్చు. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల దృష్ట్యా… చంద్రబాబు చర్యలు ఆత్మహత్యా సదృశ్యమే అయినప్పటికీ… తన స్వార్ధం కోసం, తను, తన కొడుకు మీద కేసులు లేకుండా చూసుకోవడం కోసం పార్టీనైనా బలిపెట్టడానికి చంద్రబాబు ఏమాత్రం వెనకాడడు.

అయితే చంద్రబాబుతో కలిసేందుకు మోడీ అంగీకరిస్తాడా? అనేది పెద్ద ప్రశ్న.

మోడీ చంద్రబాబు పై ఎంత కోపంగా ఉన్నాడో తెలుసుకాబట్టే… మరోవైపు నుంచి మార్గం సుగమం చేసుకుంటున్నాడు చంద్రబాబు. నెల్లూరుకు చెందిన ఒక బడా కాంట్రాక్టర్ కమ్ పొలిటీషియన్ ద్వారా నితిన్ గడ్కరీని… గడ్కరీ ద్వారా ఆర్ఎస్ఎస్ పెద్దలను ఇప్పటికే ప్రసన్నం చేసుకున్నాడు అనేది ఒక వార్త. చంద్రబాబు విషయంలో ఆర్ఎస్ఎస్ ఏమేరకు మోడీ మీద ఒత్తిడి తెస్తుందో చూడాలి.

కానీ ఇప్పటి బీజేపీ ఒకనాటి జనసంఘ్‌‌, బీజేపీలా వాళ్ళవైన విలువలున్న పార్టీ కాదు. అధికారంకోసం ఎందుకైనా సిద్ధం కాబట్టి భవిష్యత్తులో చంద్రబాబు, బీజేపీల కలయికను తోసిపుచ్చలేము.

First Published:  12 Nov 2020 1:07 AM GMT
Next Story