Telugu Global
National

నితీష్ సీఎంగా ఐదేళ్లు ఉంటారా... ఉండనిస్తారా?

ప్రస్తుతం ఎక్కడ చూసినా బీహార్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై చర్చలు జరుగుతున్నాయి. అక్కడ ఎన్డీయే కూటమి విజయం సాధించినట్లు చంకలు గుద్దు కుంటున్నా సింగిల్ పార్టీ పరంగా అత్యధిక స్థానాల్లో గెలుపొందింది మాత్రం ఆర్జేడీనే. ఆ పార్టీకి అక్కడ 110 స్థానాలు వచ్చాయి. ఎల్‌జేపీ దెబ్బతో ఒకరకంగా బీహార్‌లో జేడీయూ-బీజేపీ స్థానాలు తారుమారయ్యాయి. గత ఎన్నికల్లో 53 స్థానాలు మాత్రమే సాధించిన బీజేపీ ఈ ఎన్నికల్లో 74 స్థానాల్లో విజయం సాధించగా..గత ఎన్నికల్లో 70 స్థానాలు సాధించిన […]

నితీష్ సీఎంగా ఐదేళ్లు ఉంటారా... ఉండనిస్తారా?
X

ప్రస్తుతం ఎక్కడ చూసినా బీహార్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై చర్చలు జరుగుతున్నాయి. అక్కడ ఎన్డీయే కూటమి విజయం సాధించినట్లు చంకలు గుద్దు కుంటున్నా సింగిల్ పార్టీ పరంగా అత్యధిక స్థానాల్లో గెలుపొందింది మాత్రం ఆర్జేడీనే. ఆ పార్టీకి అక్కడ 110 స్థానాలు వచ్చాయి. ఎల్‌జేపీ దెబ్బతో ఒకరకంగా బీహార్‌లో జేడీయూ-బీజేపీ స్థానాలు తారుమారయ్యాయి.

గత ఎన్నికల్లో 53 స్థానాలు మాత్రమే సాధించిన బీజేపీ ఈ ఎన్నికల్లో 74 స్థానాల్లో విజయం సాధించగా..గత ఎన్నికల్లో 70 స్థానాలు సాధించిన జేడీయూ ఈ ఎన్నికల్లో 43 స్థానాలకే పరిమితమైంది. నితీశ్‌ను దెబ్బకొట్టేందుకు ఎల్‌జేపీని తమ బి టీమ్‌గా బరిలో దింపి… బీజేపీనే ఈ గేమ్ ప్లాన్ అమలుచేసిందన్న విమర్శలు వస్తున్నాయి.

బీహార్ లో ఎన్నికలకు ముందే ఎన్డీఏ కూటమి తమ సీఎం అభ్యర్థి నితీశ్ కుమారేనని ప్రకటించింది. అయితే జేడీయూ కంటే బీజేపీకి అధికంగా స్థానాలు వచ్చిన నేపథ్యంలో ఇంతకు నితీష్ సీఎంగా బాధ్యతలు చేపడతారా.. లేదా.. అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే బీజేపీ దీనికి సమాధానం ఇస్తూ ఎన్నికలకు ముందు ప్రకటించినట్టుగానే నితీష్ కుమారే సీఎంగా కొనసాగుతారని ప్రకటించింది.

పైకి అలా బీజేపీ ప్రకటించినప్పటికీ నితీష్ ఐదేళ్ళపాటు సీఎంగా ఉండకపోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకటి.. రెండేళ్ల పాటు నితీష్ ని సీఎంగా కొనసాగించి ఆ తర్వాత బీజేపీ పేచీ పెట్టుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇందుకు గతంలో నితీష్ కుమార్ బీజేపీతో వ్యవహరించిన వైఖరే కారణమని అంటున్నారు. 15 ఏళ్లుగా జేడీయూ ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ… మొదటిసారి మోదీ ప్రధానిగా బరిలోకి దిగే సమయంలో.. నితీష్ కూడా ప్రధాని అయ్యేందుకు ప్రయత్నాలు సాగించారు. అప్పట్లో నితీష్ కు క్రేజ్ కూడా అలాగే ఉంది. పలు సర్వేల్లో కూడా మోదీ తర్వాత అత్యంత ప్రజాకర్షక నేతగా నితీష్ నిలిచారు.

అప్పట్లో కాంగ్రెస్, బీజేపీ వైరి పక్షాలు ఒకతాటి పైకి చేరి తృతీయ ఫ్రంట్ ను ఏర్పాటు చేయడంతో పాటు నితీష్ ను ప్రధానిగా చేయాలని ప్రయత్నించాయి. తృతీయ ఫ్రంట్ కు అత్యధిక స్థానాలు వస్తే ప్రధానిగా పదవి చేపట్టేందుకు నితీష్ ఆసక్తి కనబరిచారు. మోదీపై సైతం విమర్శలకు ఆయన వెనకాడలేదు. అయితే ఆ ఎన్నికల్లో తృతీయ ఫ్రంట్ కి ఆశించినంత స్థానాలు రాకపోవడం, బీజేపీ ఘన విజయం సాధించడం జరిగింది. ఇక 2019 లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుపొందడంతో మోదీ మరింత బలమైన శక్తిగా ఎదిగారు.

నితీష్ గత ఎన్నికల సమయంలో ఎన్డీఏను వీడి లాలూతో జట్టుకట్టి ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా తిరిగి ఎన్నికయ్యారు. అయితే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం జేడీయూ -ఆర్జేడీ చెరో సగం రోజులు అధికారాన్ని పంచుకోవాలని నిర్ణయించుకోగా.. నితీష్ తెలివిగా ముందు తాను బాధ్యతలు స్వీకరించి ఆర్జేడీకి అధికారం అప్పగించాల్సిన సమయంలో ఆ పార్టీకి షాక్ ఇస్తూ కూటమి నుంచి విడిపోయారు. బీజేపీతో జట్టుకట్టి సీఎంగా కొనసాగారు.

బీజేపీ కక్ష సాధించే అవకాశం

గతంలో పలు సందర్భాల్లో మోదీకి వ్యతిరేకంగా నితీష్ ప్రవర్తించిన తీరుపై ఇప్పుడు అవకాశం రావడంతో బీజేపీ పగ సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఏడాది నుంచి రెండేళ్ల పాటు నితీశ్‌ను సీఎం సీటులో కూర్చోబెట్టి మరో ప్లాన్ అమలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. కొద్ది రోజుల అనంతరం కేంద్రంలో పదవి ఇస్తామని ఆయనను దింపేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఆ తర్వాత ఎటూ జేడీయూ తక్కువ స్థానాల్లో గెలుపొందడంతో ఆ పార్టీని బీజేపీ చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

నితీష్ మరో ప్లాన్

చిరాగ్ పాశ్వాన్ ను అడ్డుపెట్టుకొని కాషాయ పార్టీ కావాలనే తనకు తక్కువ స్థానాలు వచ్చేలా చేసిందని నితీష్ రగిలిపోతున్నారు. అందుకే ఆయన బీజేపీని అంత కంటే ఎక్కువ దెబ్బకొట్టాలనుకుంటున్నారు. తనను సీఎం పదవి నుంచి దింపేసే ప్లాన్ బీజేపీ అమలు చేస్తే దానికి విరుగుడు కూడా సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు.

తనను సీఎం అభ్యర్థిగా కొనసాగిస్తేనే బీజేపీతో పొత్తు ఉంటుందని ఇప్పటికే ఆయన నేరుగా ప్రకటించారు. బీజేపీ ఏదైనా తేడా చూపిస్తే మళ్లీ లాలూతో జట్టు కట్టేందుకు కూడా సిద్ధమని నితీష్ సంకేతాలు ఇస్తున్నారు. ఇది ఏమైనా అటు బీజేపీ వ్యూహాలు, ఇటు నితీష్ వ్యూహాలతో బీహార్ రాజకీయం రసకందాయంలో పడింది.

First Published:  13 Nov 2020 12:28 AM GMT
Next Story