ఎరుపు రంగు లిప్ స్టిక్ తో… అతని సమాధానం సూపర్ !

ఎవరి ఇష్టాలు వారికుంటాయి… అనే విచక్షణ లేకుండా కొంతమంది తమ చుట్టూ ఉన్నవారిని అదేపనిగా విమర్శిస్తుంటారు. ఆ విమర్శలకు, వెక్కిరింపులకు గురయ్యేవారు మానసికంగా ఎంతగా నలిగిపోతారనేది వారు ఆలోచించరు.

పుష్పక్ సేన్ అనే కోల్ కతా యువకుని తల్లి కూడా ఒక కుటుంబ వేడుకలో అలాంటి వెక్కిరింపులను ఎదుర్కొన్నారు. యాభై నాలుగేళ్ల వయసున్న ఆ మహిళ… కుటుంబ ఫంక్షన్లో తనకు నచ్చిన ఎరుపు రంగు లిప్ స్టిక్ వేసుకుని కనిపించారు. దాంతో ఆమె బంధువులు దగ్గరివారే ఎగతాళి చేసి ఆమె మనసుని గాయపరచారు. తల్లికి జరిగిన అవమానానికి పుష్పక్ సేన్ సైతం తల్లడిల్లాడు. ఆమె మనసుని బాధపెట్టినవారికి సరైన సమాధానం చెప్పాలని అనుకున్నాడు. అందుకు ఒక విచిత్రమైన మార్గాన్ని ఎంపిక చేసుకున్నాడతను.

తెల్లవారేసరికి అతని ఫేస్ బుక్ ఎకౌంట్ లో ఓ ఫొటోతో పాటు కొంత మ్యాటర్ కనిపించింది. అందులో గడ్డం మీసాలున్న పుష్పక్ సేన్ పెదవులకు ఎర్రని లిప్ స్టిక్ తో, కనులకు నల్లని కాటుక రేఖలతో కనిపించాడు. తను ఎందుకలా మేకప్ వేసుకోవాల్సి వచ్చిందో వివరిస్తూ… ‘మా అమ్మ… యాభైనాలుగేళ్ల మహిళ… కుటుంబం అంతా కలిసిన ఒక వేడుకలో ఎర్రని లిప్ స్టిక్ వేసుకున్నందుకు అవమానానికి గురయ్యింది’ అంటూ పోస్ట్ చేశాడు. అంతేకాదు… తన తల్లిని అవమానించిన వారికి తాను లిప్ స్టిక్ వేసుకున్న ఫొటోని … ‘గుడ్ మార్నింగ్… త్వరగా కోలుకోండి’ అనే సందేశంతో పాటు పంపాడు. తన కుటుంబాన్ని అవమానిస్తే తాను  సహించననే విషయం వాళ్లకు అర్థం కావాలనే అలా చేశానని… ముఖ్యంగా వాళ్లకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా తన తల్లి విషయంలో  జోక్యం చేసుకున్నారని పుష్పక్ సేన్ అన్నాడు.

తన తల్లి గురించి ఎగతాళిగా మాట్లాడుకున్నవారికి పిల్లలు ఉన్నారని… వాళ్లంతా సోషల్ మీడియాలో గొప్ప విషయాలు మాట్లాడుతూ చురుగ్గా ఉంటారని… కానీ తన తల్లిని అనవసరంగా మాటలు అంటున్నపుడు వారెవరూ స్పందించలేదని అది తనకు చాలా బాధని కలిగించిందన్నాడతను.

‘ గడ్డం మీసాలతో ఎర్రని లిప్ స్టిక్ వేసుకున్న నేను… సమాజం ఏమనుకుంటుందోనని తమలోని ఆశలను కోరికలను చంపేసుకునే చాలామంది తల్లులు, అక్కలు, చెల్లెళ్లు, కూతుళ్లకు… ఆడవాళ్లందరికీ… ఇంకా మగవాళ్లు కాని మిగిలినవారందరికీ … అండగా నిలబడుతున్నాను’ అంటూ సేన్ తన పోస్టులో పేర్కొన్నాడు.

సేన్ పోస్టుకి, ఫొటోకి సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున స్పందన లభించింది. చాలామంది అతడు చేసిన పనిని సమర్ధించారు. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గా ఉన్న సేన్… తనకు ఇంతటి స్పందన వస్తుందని ఊహించలేదని… ప్రతి ఒక్కరు తమని ప్రేమించేవారు విమర్శల పాలైనప్పుడు వారికి అండగా నిలవాలని అన్నాడు.

https://www.facebook.com/puspak.sen.5/posts/3682270361824638