Telugu Global
National

చరిత్రలో ఎప్పుడూలేనంత ఖరీదైన ఎన్నికలు...

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఈ దఫా అత్యంత ఖరీదైనవిగా మారబోతున్నాయి. గెలుపుని టీఆర్ఎస్, బీజేపీ రెండూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. దుబ్బాక విజేతగా దూసుకొచ్చిన బీజేపీ అదే ఉత్సాహంతో గ్రేటర్ పై కన్నేసింది. ఇప్పటినుంచి టీఆర్ఎస్ లోని అసంతృప్త నాయకుల్ని చేరదీసే వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్థులుగా మంచి ఆర్థిక పరిపుష్టి ఉన్న నాయకులకోసం వెదుకుతోంది. దుబ్బాక ఫలితంతో డీలాపడ్డ టీఆర్ఎస్ కూడా గెలుపుకోసం రకరకాల వ్యూహాలు పన్నుతోంది. సిట్టింగ్ కార్పొరేటర్లపై ఉన్న వ్యతిరేకత, […]

చరిత్రలో ఎప్పుడూలేనంత ఖరీదైన ఎన్నికలు...
X

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఈ దఫా అత్యంత ఖరీదైనవిగా మారబోతున్నాయి. గెలుపుని టీఆర్ఎస్, బీజేపీ రెండూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. దుబ్బాక విజేతగా దూసుకొచ్చిన బీజేపీ అదే ఉత్సాహంతో గ్రేటర్ పై కన్నేసింది. ఇప్పటినుంచి టీఆర్ఎస్ లోని అసంతృప్త నాయకుల్ని చేరదీసే వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్థులుగా మంచి ఆర్థిక పరిపుష్టి ఉన్న నాయకులకోసం వెదుకుతోంది.

దుబ్బాక ఫలితంతో డీలాపడ్డ టీఆర్ఎస్ కూడా గెలుపుకోసం రకరకాల వ్యూహాలు పన్నుతోంది. సిట్టింగ్ కార్పొరేటర్లపై ఉన్న వ్యతిరేకత, హైదరాబాద్ వరదలు, దుబ్బాక ఫలితం ఇవన్నీ టీఆర్ఎస్ కి గ్రేటర్ లో ప్రతిబంధకంగా మారాయి. 150 సీట్ల గ్రేటర్ కార్పొరేషన్లో గతంలో టీఆర్ఎస్ కి 99 సీట్లు వచ్చాయి, ఎంఐఎం 44సీట్లు గెల్చుకుంది. కాంగ్రెస్ 2, టీడీపీ 1, బీజేపీ 4 సీట్లు దక్కించుకున్నాయి.

అయితే పోయినసారి కొలువైన కార్పొరేటర్లలో చాలామందిపై స్థానికంగా వ్యతిరేకత ఉన్నట్టు సమాచారం. అందుకే 99మందిలో దాదాపు 70మందికి ఈ దఫా టీఆర్ఎస్ టికెట్లు నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ వరదలు, ఆ తర్వాత ఇచ్చిన నష్టపరిహారం రెండూ టీఆర్ఎస్ కి నెగెటివ్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా నష్టపరిహారం విషయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల చేతివాటం పార్టీకి ఇబ్బంది తెచ్చింది. దీంతో ఆ చెడ్డపేరు పోగొట్టుకోడానికి మరోసారి పరిహారాన్నికూడా ప్రకటించేశారు కేటీఆర్.

గతంలో పరిహారం అందని వాళ్లు మీసేవా కేంద్రాల్లో పేరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తే చాలు వరదసాయం డిపాజిట్ చేస్తామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్ విలువ 100కోట్ల రూపాయలు. తెలంగాణ వ్యాప్తంగా 15వేల లోపు ఆస్తిపన్ను చెల్లింపుల్లో 50శాతం రాయితీ ప్రకటించి మధ్యతరగతి ఓటర్ల మనసు గెలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ పథకానికి పెడుతున్న ఖర్చు 326కోట్లు. పారిశుధ్య కార్మికులకు కూడా వేతనాలు పెంచేసింది కేసీఆర్ సర్కార్. ప్రతి ఉద్యోగికి 3వేల రూపాయల జీతం పెంచేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే ఇలా ముందస్తు ప్రకటలతో ఓటర్లను ఆకర్షిస్తోంది టీఆర్ఎస్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎన్నికల్లో పంచబోతున్న నగదు వ్యవహారం మరో ఎత్తు. ఎన్నికలకోసం 10కోట్ల వరకయినా ఖర్చు పెట్టగలిగే నాయకులకే ఈసారి టికెట్ అంటూ టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలిస్తే అంతకు అంత రాబట్టుకునే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ పనుల్లో కమీషన్లు, నిర్మాణ అనుమతులు, ఇతరత్రా వ్యవహారాలతో.. ఆదాయం బాగుంటుంది కాబట్టి.. ఆమాత్రం ఖర్చుకి అభ్యర్థులెవరూ వెనకాడకపోవచ్చు.

అయితే సిట్టింగ్ కార్పొరేటర్ల మీద ఉన్న వ్యతిరేకతతో ఈసారి అధికార టీఆర్ఎస్ దాదాపుగా అన్నీ కొత్త ముఖాలనే ఏరికోరి తీసుకురాబోతోంది. అసెంబ్లీకి ఎన్నికలు జరిగినంత ప్రతిష్టాత్మకంగా ఈసారి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగబోతున్నాయనేమాట వాస్తవం. దుబ్బాక పరాజయాన్ని లైట్ తీసుకున్నా.. గ్రేటర్ లో పరువుపోతే.. బీజేపీ దూకుడిని ఆపడం కష్టం.

అందుకే.. టీఆర్ఎస్ ఈ ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భాగ్య నగరంపై పట్టు పెంచుకోవాలని చూస్తున్న బీజేపీకి చెక్ పెట్టాలని ప్లాన్లు గీస్తోంది. రాష్ట్రం, కేంద్రంలోని అధికార పార్టీలు.. రెండూ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. జీహెచ్ఎంసీ చరిత్రలో ఎప్పుడూ లేనంత కాస్ట్ లీగా ఈ ఎన్నికలు మారబోతున్నాయి.

First Published:  14 Nov 2020 11:04 PM GMT
Next Story