జీహెచ్ఎంసీ ఎన్నికలకోసం బీహార్ గ్యాంగ్…

దుబ్బాక విజయంతో హుషారుగా ఉన్న బీజేపీ శ్రేణులు గ్రేటర్ హైదరాబాద్ పీఠంపై జెండా ఎగరేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అటు టీఆర్ఎస్ ప్రభుత్వం తాయిలాలు ప్రకటిస్తూ ప్రజల్ని ఆకర్షిస్తుంటే.. ఇటు బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.

బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయంలో కీలకంగా వ్యవహరించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ గ్రేటర్ ఎన్నికలకోసం కసరత్తులు చేయబోతోంది. భూపేందర్ యాదవ్ సహా.. కర్నాటక హెల్త్ మినిస్టర్ కె.సుధాకర్, కర్నాటక ఎమ్మెల్యే సతీష్ రెడ్డి, మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నేత ఆశిష్ షెలార్, గుజరాత్ కి చెందిన సీనియర్ నాయకుడు ప్రదీప్ సింగ్ వాఘేలా.. ఈ టీమ్ లో మెంబర్లుగా ఉంటారు. వీరంతా కలసి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు వ్యూహ రచన చేస్తున్నారు.

బీహార్ ప్రణాళికే ప్రాతిపదిక…

ప్రీపోల్స్, ఎగ్జిట్ పోల్స్ అన్నీ.. మహా గట్ బంధన్ కే అనుకూలంగా ఉన్నా.. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయకేతనం ఎగురవేసింది. జేడీయూని తొక్కేసి మరీ బీజేపీ అత్యథిక స్థానాలు కైవసం చేసుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఈ విజయంలో కీలక పాత్ర వహించిన వారిలో ముఖ్యులు భూపేందర్ యాదవ్. రాజ్యసభ సభ్యుడైన భూపేందర్ యాదవ్, బీహార్ రాష్ట్ర బీజేపీకి ఇంచార్జి. ఆయన నేతృత్వంలోనే పార్టీ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంది.

కేంద్ర నాయకత్వం కూడా ఈ దఫా బీహార్ ఎన్నికల్లో పెద్దగా ప్రచారం చేసిన దాఖలాలు లేవు. వారి పరోక్షంలో అన్నీ తానై వ్యవహరించిన భూపేందర్ యాదవ్, బీహార్ లో బీజేపీకి ఘన విజయాన్ని సాధించి పెట్టారు. 72సీట్ల భారీ ఆధిక్యాన్ని ఆ పార్టీ నేతలు కూడా ఊహించలేదు. ఇలాంటి విజయాన్ని బీజేపీకి అందించిన భూపేందర్ యాదవ్ వ్యూహాలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా విజయాలను అందిస్తాయని ఆశపడుతున్నారు తెలంగాణ నేతలు.

అందుకే ఆయన్ని ప్రత్యేకంగా ఈ ఆపరేషన్ కోసం ఆహ్వానించారట. కేంద్ర నాయకత్వం కూడా భూపేందర్ యాదవ్ నేతృత్వంలో స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేసి భాగ్యనగరంపై కాషాయ జెండా రెపరెపలాడేలా చేయాలని ఆదేశించింది. దుబ్బాకలో 1079ఓట్ల మెజార్టీని గాలివాటు విజయంగా కొట్టి పారేస్తున్న టీఆర్ఎస్ ని గ్రేటర్ బరిలో మరింత గట్టి దెబ్బ కొట్టాలని బీజేపీ ఆశ, ఆశయం. అందుకే స్పెషల్ టీమ్ ని రంగంలోకి దింపుతున్నారు.