Telugu Global
National

ఏపీలో చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్లు...

మహిళా పోలీస్ స్టేషన్ల గురించి విన్నాం, కొత్తగా దిశ పోలీస్ స్టేషన్ల గురించి వింటున్నాం.. ఇప్పుడు మరింత కొత్తగా చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్లు ఏపీలో దర్శనమివ్వబోతున్నాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ తరహా పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకి రంగం సిద్ధమైంది. కృష్ణాజిల్లాలోని 5 పోలీస్ స్టేషన్లను ఇలా చైల్డ్ ఫ్రెండ్లీగా మార్చబోతోంది ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్. మచిలీపట్నం, నూజివీడు, గుడివాడ, నందిగామ, అవనిగడ్డ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లు ఇక చైల్డ్ ఫ్రెండ్లీగా ఉండబోతున్నాయి. పిల్లలకి ఆట […]

ఏపీలో చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్లు...
X

మహిళా పోలీస్ స్టేషన్ల గురించి విన్నాం, కొత్తగా దిశ పోలీస్ స్టేషన్ల గురించి వింటున్నాం.. ఇప్పుడు మరింత కొత్తగా చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్లు ఏపీలో దర్శనమివ్వబోతున్నాయి.

రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ తరహా పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకి రంగం సిద్ధమైంది. కృష్ణాజిల్లాలోని 5 పోలీస్ స్టేషన్లను ఇలా చైల్డ్ ఫ్రెండ్లీగా మార్చబోతోంది ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్. మచిలీపట్నం, నూజివీడు, గుడివాడ, నందిగామ, అవనిగడ్డ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లు ఇక చైల్డ్ ఫ్రెండ్లీగా ఉండబోతున్నాయి.

పిల్లలకి ఆట స్థలం, అవసరమైన ఆట వస్తువులు, వారికి సంబంధించిన దుస్తులు, అత్యవసర ఆహార పదార్థాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్.. అన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది కూడా ఖాకీ దుస్తుల్లో కరకుగా కాకుండా.. పింక్ దుస్తుల్లో ఆహ్లాదంగా కనిపిస్తారు. మహిళ, శిశు సంరక్షణ కేంద్రాల సిబ్బంది కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు. బాలల శిక్షాస్మృతి-2015 సెక్షన్ 107 ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ ఆఫీసర్ ఉండాలనేది నిబంధన. ఇంట్లోనుంచి పారిపోయి వచ్చిన పిల్లలు, తెలిసీ తెలియని వయసులో నేరాలు చేసిన పిల్లలు.. మొదలైనవారికి వీరు న్యాయ సలహాలు అందించాలి. వారికి అండగా నిలబడాలి. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ తరహా పోలీస్ స్టేషన్లు ఉన్నా.. ఏపీలో మాత్రం ఇదే తొలిసారి.

నవంబర్ 20న అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా ఐదింటిలో రెండింటిని(గుడివాడ, మచిలీపట్నం) ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఈపాటికే పూర్తయ్యాయి. చైల్డ్ రైట్స్ అడ్వొకసీ ఫౌండేషన్ ఏపీ ప్రోగ్రామ్ డైరెక్టర్ పి.ఫ్రాన్సిస్, వరల్డ్ విజన్ ఇండియా స్టేట్ మేనేజర్ తమిత ఫ్రాన్సిస్.. ఈ చైల్డ్ ఫ్రెండ్స్ పోలీస్ స్టేషన్లకు స్పాన్సర్స్ గా వ్యవహరిస్తున్నారు.

రాష్ట్రంలో తొలిసారి ఇలా చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నందుకు డీజీపీ గౌతమ్ సవాంగ్ కు వారు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో ఏపీలోని ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు గౌతమ్ సవాంగ్.

First Published:  16 Nov 2020 11:50 PM GMT
Next Story