Telugu Global
National

ఎన్నికల వేళ డీఎంకేకి షాక్... బీజేపీ వైపు అళగిరి అడుగులు

తమిళనాడులో మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి డీఎంకేకు అధికారం తథ్యం అని విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది. డీఎంకే అధినేత స్టాలిన్ సోదరుడు, కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే అళగిరికి బీజేపీ గాలం వేసింది. ఎన్నికల్లో ఎలాగైనా స్టాలిన్ ను దెబ్బకొట్టేందుకు ప్రణాళికలు రచించిన బీజేపీ అధిష్టానం అళగిరితో కొత్తగా పార్టీ పెట్టించడమో, లేదా బీజేపీలోకి చేర్చుకోవడం ద్వారా స్టాలిన్ ను దెబ్బకొట్టాలని ప్లాన్ వేసింది. ప్రస్తుతం […]

ఎన్నికల వేళ డీఎంకేకి షాక్... బీజేపీ వైపు అళగిరి అడుగులు
X

తమిళనాడులో మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి డీఎంకేకు అధికారం తథ్యం అని విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది. డీఎంకే అధినేత స్టాలిన్ సోదరుడు, కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే అళగిరికి బీజేపీ గాలం వేసింది. ఎన్నికల్లో ఎలాగైనా స్టాలిన్ ను దెబ్బకొట్టేందుకు ప్రణాళికలు రచించిన బీజేపీ అధిష్టానం అళగిరితో కొత్తగా పార్టీ పెట్టించడమో, లేదా బీజేపీలోకి చేర్చుకోవడం ద్వారా స్టాలిన్ ను దెబ్బకొట్టాలని ప్లాన్ వేసింది. ప్రస్తుతం అళగిరి వ్యవహారం తమిళనాడు లో హాట్ టాపిక్ గా మారింది.

2014లో తమిళనాడులో జరిగిన ఎన్నికలకు ముందు తన రాజకీయ వారసుడిగా కరుణానిధి స్టాలిన్ ని ప్రకటించారు. పార్టీ బాధ్యతలను కూడా అప్పగించారు. స్టాలిన్ డీఎంకే పగ్గాలు అందుకున్న తర్వాత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే పేరుతో తన సోదరుడు అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు. అప్పట్నుంచి అళగిరి క్రియాశీలక రాజకీయాల్లో లేరు. 2018 లో కరుణానిధి చనిపోయిన తర్వాత ఒక నెల రోజుల అనంతరం తన అనుచరులతో కలిసి ఒక రాజకీయ ప్రదర్శన నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఆయన రాజకీయాలకు సంబంధించిన కార్యకలాపాలకు చాలా దూరంగా ఉన్నారు.

దక్షిణాదిలో బలోపేతం కావాలని భావిస్తున్న బీజేపీ ఇప్పటికే కర్ణాటకలో బలమైన పార్టీగా అవతరించగా.. మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో కూడా తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు చేపడుతోంది. తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటి నాలుగు ఎంపీ సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ… ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ను మట్టి కరిపించి తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని చాటి చెప్పింది.

ఇక ఏపీలోనూ జనసేన తో జతకట్టి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం చర్యలు చేపడుతోంది. తమిళనాడులో ఇప్పటికే అన్నాడీఎంకేను తన చెప్పుచేతల్లో పెట్టుకున్న బీజేపీ ఆరు నెలల్లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ నుంచి వచ్చిన ఖుష్బూను పార్టీలో చేర్చుకుని కీలక బాధ్యతలు అప్పగించింది.

అన్నాడీఎంకేలో బలమైన నేత లేకపోవడం, కమల్ హాసన్ పార్టీ ఇంకా పుంజుకోకపోవడం, రజినీ ఇంకా రాజకీయాల్లోకి వచ్చేది లేనిది క్లారిటీ ఇవ్వకపోవడంతో వచ్చే ఎన్నికల్లో గెలిచేది డీఎంకేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దీంతో డీఎంకే విజయావకాశాలు దెబ్బతీయడానికి బీజేపీ రంగంలోకి దిగింది. డీఎంకేకి దూరమైన అళగిరిని ప్రోత్సహించి కొత్త పార్టీ స్థాపించడం ద్వారా, లేదా బీజేపీలోకి చేర్పించుకోవడం ద్వారా డీఎంకే ఓట్లను చీల్చాలని బీజేపీ భావిస్తోంది.

కాగా, అళగిరి పార్టీ పేరు ఇప్పటికే ఖరారైనట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ‘కలైంగర్ డీఎంకే’ కానీ ‘కేడీఎంకే’ అనే పేర్లతో ఈ పార్టీ ఉండబోతోందట. అయితే ఈ విషయమై అళగిరి ఎటువంటి ప్రకటన చేయలేదు.

బీజేపీ అధిష్టానం చేపడుతున్న చర్యలు, అళగిరి అడుగులను డీఎంకే నిశితంగా పరిశీలిస్తోంది. అళగిరి వెంట ఉన్న అనుచరులను పార్టీ వైపునకు తిప్పుకునేందుకు పావులు కదుపుతోంది. ఏది ఏమైనా కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి బీజేపీకి మద్దతు ఇవ్వనున్నట్లు వస్తున్న వార్తలతో తమిళనాట రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.

First Published:  16 Nov 2020 11:39 PM GMT
Next Story