బీజేపీకంటే తొందరపడుతున్న చంద్రబాబు…

తిరుపతి ఎంపీగా ఉండి మరణించిన బల్లి దుర్గా ప్రసాద్ కి వైసీపీతో ఉన్న అనుబంధం కేవలం ఏడాదిన్నర మాత్రమే. అదే టీడీపీతో ఆయన ప్రయాణం 1985నుంచి 2019 వరకు కొనసాగింది. ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేసి, ఆ తర్వాత చంద్రబాబుకి మంచి నమ్మకస్తుడిగా ఉన్న బల్లి దుర్గా ప్రసాద్ మరణంతో వస్తున్న ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టదు అని అనుకున్నారంతా. చంద్రబాబు కూడా దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులపై ఎవరినీ పోటీకి దించబోమని గతంలో పార్టీ నేతలకు చూచాయగా చెప్పారు.

అయితే అనూహ్యంగా బాబు టీడీపీ అభ్యర్థిని ప్రకటించారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున తిరుపతి లోక్ సభకు పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని అభ్యర్థిగా నిర్ణయించారు. ఏ ఎన్నికలకయినా చివరి నిముషంలో అభ్యర్థులను ఖరారు చేసే అలవాటున్న చంద్రబాబు.. ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ కూడా రాకముందే పనబాకను అభ్యర్థిగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

వాస్తవానికి దుబ్బాకలో బీజేపీ విజేత కాకపోయి ఉంటే.. బాబు కూడా తిరుపతి ఎన్నికను తేలిగ్గా తీసుకునేవారు. కానీ దుబ్బాక ఫలితంతో అంతా తారుమారైంది. సింపతీతో విజయం నల్లేరుపై నడక అనుకున్న టీఆర్ఎస్ కి షాకిచ్చింది బీజేపీ. ఏపీలో కూడా ఇదే వ్యూహంతో తిరుపతి లోక్ సభ స్థానాన్ని ఒడిసి పట్టాలనుకుంటోంది. టీడీపీకి ఎలాగూ అక్కడ గెలిచే అవకాశం లేదు, కనీసం వైసీపీని అయినా దెబ్బకొట్టాలనే వ్యూహంతో టీడీపీ తరపున అభ్యర్థిని ప్రకటించేశారు చంద్రబాబు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్లను చీల్చడం కోసం వ్యూహాత్మకంగా బాబు ఈ ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. తిరుపతి ఎస్సీ రిజర్వ్ డ్ స్థానం. దళిత ఓట్లన్నీ గంపగుత్తగా ఒకే పార్టీకి పడతాయని చెప్పలేం. అన్ని పార్టీల తరపున అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులున్నప్పటిగీ గత ఎన్నికల్లో దళితులంతా వైసీపీకి అండగా నిలబడ్డారని ఫలితాలు చెబుతున్నాయి.

ఒకవేళ టీడీపీ పోటీ చేయకపోతే.. దళిత ఓట్లన్నీ మరోసారి వైసీపీకి వెళ్లే ఛాన్స్ ఉంది. అందుకే వైసీపీ ఓట్లను చీల్చేందుకు, పరోక్షంగా బీజేపీ-జనసేన కూటమికి సహకరించేందుకే చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించారని తెలుస్తోంది. ముందుగానే అభ్యర్థిని ప్రకటించి ఒకరకంగా ప్రత్యర్థి పార్టీలను ఆలోచనలో పడేశారు చంద్రబాబు. వైసీపీ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు, కనీసం బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యులకే అవకాశం ఇస్తామని కూడా చెప్పలేదు.

ఇక బీజేపీ ఒక మంచి సౌండ్ పార్టీకోసం వెదుకుతోంది. దుబ్బాక ఫలితాన్ని రిపీట్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికలకోసం బీహార్ వ్యూహకర్తలను రప్పిస్తున్న నాయకులు, తిరుపతి ఎన్నికలకోసం కూడా మరో టీమ్ ని సిద్ధం చేసినా ఆశ్చర్యం లేదు. అయితే అడక్కుండానే అభ్యర్థిని ప్రకటించి తమకు సాయం చేసిన చంద్రబాబుపై బీజేపీ కేంద్ర నాయకత్వం జాలి చూపిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.