తమిళనాడులో గవర్నమెంట్ స్కూళ్ల పిల్లలకు మెడికల్  సీట్లలో రిజర్వేషన్ !

ఈ ఏడాది తమిళనాడులో ఎమ్ బిబిఎస్ లో చేరబోతున్నవారిలో 400 మంది ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్నవారు ఉండబోతున్నారు. గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకున్నవారికి ప్రభుత్వం 7.5 శాతం మెడికల్ సీట్లను కేటాయించిన నేపథ్యంలో 400 మందికి ఈ అవకాశం ఉంటుందని తమిళనాడు పాఠశాల విద్యాశాఖా మంత్రి కె ఎ సెంగొట్టియన్ తెలిపారు.

313 మందికి మెడికల్ సీట్లు, 92 మందికి డెంటల్ కాలేజీలో సీట్లు రానున్నాయని మంత్రి వివరించారు. వీరిలో 55 మంది ఒక్క ఈరోడ్ జిల్లాకు చెందినవారే. దేశం మొత్తంలో తమిళనాడులో మాత్రమే ఈ 7.5శాతం రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు.

గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ అనుమతి ఇచ్చిన అనంతరం… ఈ విద్యాసంవత్సరం (2020-2021) నుండి ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్న విద్యార్థులకు మెడికల్ సీట్లలో 7.5శాతం సీట్ల కేటాయింపు జీవోని ప్రభుత్వం జారీ చేసింది. 10,11,12 తరగతులకు పరీక్షల నిర్వహణ గురించి చెబుతూ … డిసెంబరు చివరి నాటికి ప్రభుత్వం పరీక్షల తేదీని వెల్లడిస్తుందని మంత్రి తెలిపారు.