వకీల్ సాబ్ కు మళ్లీ బ్రేకులు

ఈ నెలాఖరుకు పూర్తవుతుందనుకున్న వకీల్ సాబ్ సినిమాకు మళ్లీ బ్రేకులు పడబోతున్నాయి. ఈసారి పవన్ మరింత బిజీ కాబోతున్నాడు. అవును.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం కోసం వకీల్ సాబ్ షూటింగ్ ను ఆపబోతున్నాడు పవన్.

ఎన్నికల నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది. ప్రచారానికి 13 రోజులు మాత్రమే టైమ్ కేటాయించారు. పవన్ కనీసం 3 రోజుల పాటు ప్రచారం చేస్తాడని అనుకుంటున్నారు. సో.. ఆ 3 రోజులతో పాటు మరో 2 రోజులు కలుపుకొని మొత్తంగా 5 రోజుల పాటు వకీల్ సాబ్ షూటింగ్ నిలిచిపోనుంది.

అటు దిల్ రాజు కూడా షూటింగ్ ఆగిపోతున్నందుకు బాధపడడం లేదు. ఎందుకంటే, ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొద్దామనే తొందర మొన్నటివరకు ఉండేది. ఎప్పుడైతే సంక్రాంతి బరి నుంచి వకీల్ సాబ్ తప్పుకుందో, ఇక షూటింగ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు.

ఆల్రెడీ 90శాతం పూర్తయిన వకీల్ సాబ్ షూటింగ్.. డిసెంబర్ నెలలో కూడా కొనసాగే అవకాశం ఉంది. జనవరి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి, వేసవికి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.