Telugu Global
National

పవన్ కల్యాణ్ ది ఆవేశమా..? ఆలోచనా..?

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బరిలో సొంతంగా దిగాలని పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం అటు తెలంగాణ, ఇటు ఏపీ రాజకీయాల్లో కూడా సంచలనంగా మారింది. పవన్ కల్యాణ్ అతిగా ఆవేశ పడుతున్నారని, ఒక్క సీటుకూడా గెలిచే పరిస్థితి లేదని, ఆయన పోటీ వల్ల మిత్రపక్షం బీజేపీకి కూడా నష్టం జరుగుతుందనేది ఓ వర్గం వాదన. బీహార్ లో ఎల్జేపీని పావులా వాడుకున్న బీజేపీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనని కూడా అలాగే ఓట్లు చీల్చేందుకు ఉపయోగించుకుంటోందని, ఇదంతా బీజేపీ-జనసేన హిడెన్ […]

పవన్ కల్యాణ్ ది ఆవేశమా..? ఆలోచనా..?
X

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బరిలో సొంతంగా దిగాలని పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం అటు తెలంగాణ, ఇటు ఏపీ రాజకీయాల్లో కూడా సంచలనంగా మారింది. పవన్ కల్యాణ్ అతిగా ఆవేశ పడుతున్నారని, ఒక్క సీటుకూడా గెలిచే పరిస్థితి లేదని, ఆయన పోటీ వల్ల మిత్రపక్షం బీజేపీకి కూడా నష్టం జరుగుతుందనేది ఓ వర్గం వాదన.

బీహార్ లో ఎల్జేపీని పావులా వాడుకున్న బీజేపీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనని కూడా అలాగే ఓట్లు చీల్చేందుకు ఉపయోగించుకుంటోందని, ఇదంతా బీజేపీ-జనసేన హిడెన్ అజెండా అనేది మరో వాదన. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పిన మాటల్ని బట్టి చూస్తే.. జనసేనాని ప్రకటనకు ముందు ఎలాంటి చర్చలు జరగలేదనే విషయం స్పష్టమవుతోంది.

అసలు పవన్ కల్యాణ్ విడుదల చేసిన ప్రకటన కూడా పూర్తి అస్పష్టంగా ఉంది. కార్యకర్తలు, నాయకుల కోరిక మేరకు, వారి ఆశల మేరకు పోటీ చేస్తున్నామని చెప్పారే కానీ, ఎన్ని సీట్లలో, ఏయే సీట్లలో బరిలో దిగుతున్నారో స్పష్టం చేయలేదు. అప్పటికప్పుడు చెప్పాల్సిన రూల్ లేదు కానీ.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక, పోలింగ్ పట్టుమని 15రోజులు కూడా టైమ్ లేని సందర్భంలో ఇంకా ఇలాంటి అస్పష్ట ప్రకటనలతో ఉపయోగం లేదు. జనసేన జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బరిలో దిగితే వారి మేనిఫెస్టో ఏంటో కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది.

అన్ని స్థానాల్లో పోటీ చేయకుండా… కేవలం సెటిలర్ల బలం ఉన్న కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యే సందర్భంలో… గెలిచాక ఎవరితో కలిసుంటారో అది కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గెలిచాక తాము కచ్చితంగా బీజేపీతోనే ఉంటామని బీహార్ ఎన్నికలకు ముందే ఎల్జేపీ తేల్చి చెప్పింది. మరిక్కడ కూడా పవన్ కల్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ అభ్యర్థులు గెలిస్తే వారు బీజేపీకి మద్దతిస్తారని ధైర్యంగా చెప్పగలరా? ఒకవేళ ఎన్నికల ముందు అలా చెబితే జనసేన అభ్యర్థులను ఎవరైనా పరిగణలోకి తీసుకుంటారా..?

ఈ సమీకరణాలన్నిటి మధ్య పవన్ కల్యాణ్ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. కలసి పోటీ చేస్తున్నామని చెప్పకపోయినా… కనీసం ఒకరు పోటీచేసే చోట ఇంకొకరు అభ్యర్థుల్ని నిలబెట్టకుండా సహకరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా సహకరించుకోని సందర్భంలో.. జనసేన-బీజేపీ పొత్తు మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోతుంది.

First Published:  17 Nov 2020 11:41 PM GMT
Next Story