ఆదిపురుష్ రిలీజ్ డేట్ లాక్

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఆదిపురుష్ కు సంబంధించి రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు మేకర్స్. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాను 2022 ఆగస్ట్ 11 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

నిజానికి ఈ సినిమా ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి తాజాగా డేట్ ఎనౌన్స్ చేసి రెండేళ్ళ ముందు థియేటర్స్ లాక్ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా రాధేశ్యామ్ రిలీజ్ డేట్ కంటే ముందే ఆదిపురుష్ విడుదల తేదీని ప్రకటించడం విశేషం.

రామాయణంలో ఓ భాగాన్ని తీసుకొని ఓం రౌత్ రూపొందిస్తున్న ఈ సినిమాలో రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించనున్నాడు. ప్రభాస్ సరసన సీత పాత్రలో కనిపించబోయే హీరోయిన్ ఎవరనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే హీరోయిన్ ని కూడా ఫైనల్ చేసి ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు.

ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాను ఫినిషింగ్ స్టేజికి తీసుకొచ్చిన ప్రభాస్ త్వరలోనే నాగ అశ్విన్ తో చేయబోయే సినిమాను స్టార్ట్ చేస్తాడు. ఆ సినిమాతో పాటే ఆదిపురుష్ ను కూడా మొదలు పెట్టే అవకాశం ఉంది.