వెబ్ సిరీస్ లో సూర్య

ఓ సూపర్ హిట్ వచ్చిన తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరో సినిమాను లైన్లో పెడుతుంటారు హీరోలు. పనిలోపనిగా తమ రెమ్యూనరేషన్ కూడా పెంచుకుంటారు. కానీ సూర్య మాత్రం రివర్స్ లో ఆలోచిస్తున్నట్టున్నాడు. ఆకాశం నీ హద్దురా సినిమా సూపర్ హిట్టయిన తర్వాత సూర్య మరో సినిమా చేయలేదు. అలా అని ఖాళీగా కూడా ఉండలేదు. ఏకంగా ఓ వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాడు.

అవును.. కెరీర్ లో ఫస్ట్ టైమ్, సూర్య ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఈ సిరీస్ కు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నాడు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా మొదలైంది. ఈ విషయాన్ని పీసీ శ్రీరామ్ స్వయంగా బయటపెట్టాడు.

ఓ స్టార్ హీరో, అది కూడా సూపర్ హిట్ కొట్టిన తర్వాత ఇలా వెబ్ సిరీస్ స్టార్ట్ చేయడం ఆశ్చర్యకరమైన అంశమే అయినప్పటికీ.. సూర్య ఎప్పుడూ తనకుతాను బౌండరీస్ పెట్టుకోలేదు.

థియేటర్ తో సమానంగా ఓటీటీని కూడా చూస్తానని ఇదివరకే ప్రకటించాడు. చెప్పినట్టుగానే తన భార్య సినిమాతో పాటు తన సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఏకంగా ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.