వందమంది వెళ్లిపోతే వెయ్యిమందిని తయారు చేస్తా…

2014లో రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పామని, అది అప్పటి స్లోగన్ అని అన్నారు పవన్ కల్యాణ్. జనసేన ప్రశ్నిస్తుంటే మిగతా పార్టీలు అధికారం అనుభవించడానికి మనం పార్టీ పెట్టలేదు. అధికారంలోకి వచ్చి ప్రజల కోసం నిలబడాలన్న బలమైన కాంక్షతోనే పార్టీ పెట్టానని చెప్పారు. జమిలి ఎన్నికలపై కూడా తమన మనసులో మాట బైట పెట్టారు జనసేనాని.

2024కంటే ముందే ఏపీలో ఎన్నికలు వస్తాయని, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. కేంద్రం ప్రభుత్వం దేశం మొత్తానికి ఒకేసారి ఎన్నికలు పెట్టాలని చూస్తోందని, ఇప్పటికే ఇతర రాష్ట్రాల పార్టీలు దానికి సమాయత్తం అవుతున్నాయని అన్నారు. పార్టీలో లేకుండా జనసేన సపోర్టర్స్ అంటూ కొంతమంది వేర్వేరు ప్లాట్ ఫామ్స్ పై ఉంటున్నారని, వారిని ఎవరూ ప్రోత్సహించొద్దని, ఎవరికైనా పార్టీ ద్వారానే గుర్తింపు రావాలని చెప్పారు పవన్. వ్యక్తిగత అజెండాతో పనిచేసే ఎవర్నీ పార్టీ ప్రోత్సహించదని చెప్పారు.

ఇక పార్టీలోని అంతర్గత కలహాలపై కూడా తీవ్రంగా స్పందించారు పవన్. పార్టీ నాయకత్వంపై సోషల్ మీడియాలో విమర్శలు చేసే వారిని ఉపేక్షించబోనని చెప్పారు పవన్. స్థానిక నాయకులు నచ్చకపోతే తమకు తెలియజేయాలని, అంతేకాని ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో రెచ్చిపోతే సహించబోనని హెచ్చరించారు.

వందమంది వెళ్లిపోతే బలహీనపడే వ్యక్తిని తాను కాదని, వెయ్యిమందిని తయారు చేసుకునే సత్తా తనకు ఉందని స్పష్టం చేశారు. రాజకీయాలు తనకి సరదా కాదని, బాధ్యత అని చెప్పారు. అదే సమయంలో ఎవరినీ గడ్డం పట్టుకుని బతిమిలాడాల్సిన పనిలేదని తెగేసి చెప్పారు పవన్.

పార్టీ వ్యవహారాలపై సోషల్ మీడియాకి ఎక్కి రచ్చ చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించబోనని ఖరాఖండిగా చెప్పేశారు. ఇక క్రియాశీలక కార్యకర్తలంతా పార్టీకోసం కష్టపడి పనిచేయాలని, బెదిరింపులకు భయపడొద్దని ధైర్యం చెప్పారు. బలమైన కార్యకర్తల వ్యవస్థ ఉందని చెప్పుకుంటున్న టీడీపీ కూడా అధికారం కోల్పోయాక ఇబ్బందులు పడుతోందని, సమస్యలపై ధైర్యంగా పోరాడుతున్న కార్యకర్తలు జనసేనకే ఉన్నారని అన్నారు పవన్ కల్యాణ్.